
వారధిలా పనిచేయాలి
తెలంగాణ సమాజానికి, సర్కారుకు మధ్య తెలంగాణ విద్యావంతుల వేదిక వారధిగా పనిచేయాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అభిలషించారు.
తెలంగాణ పునర్వికాసంలో విద్యావంతుల వేదిక అర్థవంతమైన పాత్ర పోషించాలి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి.. మార్గనిర్దేశకంగా నిలవాలని సూచన
రాష్ట్రం వచ్చాక పోరాట సంఘాల పాత్ర మారుతుంది: కోదండరాం
మంచిర్యాల: తెలంగాణ సమాజానికి, సర్కారుకు మధ్య తెలంగాణ విద్యావంతుల వేదిక వారధిగా పనిచేయాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అభిలషించారు. ఇందుకోసం అట్టడుగు వర్గాల నుంచి అభివృద్ధి ప్రారంభమయ్యేలా వ్యూహాలు రచించాలని సూచించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని జయశంకర్ ప్రాంగణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల స్వప్నాలను నెరవేర్చేందుకు, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించేందుకు మేధావులు, విద్యావంతులు పాటుపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు టీవీవీ నాయకత్వం వహించాలని, నిరంతరం ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తుకు మార్గదర్శకం వహించాలని రామచంద్రమూర్తి ఆకాంక్షించారు. ‘‘తెలంగాణ కోసం పోరాడేందుకు ఎవరూ సన్నద్ధంగా లేనపుడు ఆ స్ఫూర్తిని కలిగించింది ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరే.
భావ ప్రచారం, ఉద్యమ నిర్మాణం, రాజకీయ కార్యాచరణ అనే మూడు లక్షణాలను పాటించడం వల్లే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ పునర్వికాసంలో సకల జనులు పాల్గొనేలా చేస్తూ టీవీవీ అర్థవంతమైన పాత్ర పోషించాలి. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అనే ప్రశ్నకు ‘సంభవం కాకపోయేది..’ అనే జవాబు వస్తుంది. టీవీవీ, టీ.జేఏసీ నాయకులు ఒక్కరే. ఇదే స్ఫూర్తిని తెలంగాణ వికాసం కోసం జరపాలి..’’అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 150 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణాలు, ఫ్లోరైడ్ సమస్యలు, గల్ఫ్ మోసాలు వంటి సమస్యల పరిష్కారం కోసం సర్కారుతో పాటు సమాజమూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం విద్యావంతుల వేదిక మార్గనిర్దేశక సంస్థగా, నిఘా సంస్థగా ఉండాలని సూచించారు.
పాత్ర మారుతుంది..: కోదండరాం
తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి చైతన్యం అందించేలా టీవీవీ కృషి చేయాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సంఘాలు, వేదికల అవసరం లేదనే అభిప్రాయం సరికాదని... పాత్ర మారుతుందే తప్ప వాటి ఉనికిని కోల్పోవాల్సిన అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో ఓపెన్‌కాస్టుల ఏర్పాటు ఆంధ్ర ప్రాంతం వారి ఎత్తుగడని.. ఆ విధానంతో ఉత్పత్తి పెరిగి సింగరేణికి దక్కుతున్న ఆదాయం కంటే ఎక్కువ ఆ కాంట్రాక్టర్లకు చెందుతోందని విమర్శించారు. అడ్వొకేట్ జేఏసీ ైచె ర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణవాదుల్లో చైతన్యాన్ని రేకెత్తించడంలో విద్యావంతుల వేదిక పాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్య క్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీవీవీ నేత శ్రీధర్ దేశ్‌పాండే, టీవీవీ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.