సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో గల్ఫ్‌లో మగ్గుతున్న 39 మంది తెలంగాణ కార్మికులకు విముక్తి లభించింది. సౌదీ అరేబియాలోని జే అండ్ పీ కంపెనీలో దాదాపు ఏడాదిన్నర కాలంగా బంధించబడ్డ కార్మికులు ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌కు చేరుకున్న వారికి ప్రయాణ ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేసింది. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది.
అనేక కష్టాలు పడుతున్న కార్మికులు తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కి తెలియజేశారు. దీంతో కార్మికుల సమస్యల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు కేంద్ర విదేశాంగ అధికారుల సహాయం కూడా తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వారందరి కృషి ఫలితంగా కార్మికులు తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టారు. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు దన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment