
స్కూల్లో తెలంగాణ ఉద్యమ పాఠాలు
తెలంగాణలో స్కూలు విద్యార్థులు కొత్త పాఠాలు నేర్చుకోనున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ కోణంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్కూలు విద్యార్థులు కొత్త పాఠాలు నేర్చుకోనున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ కోణంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు, తర్వాత ఉన్న పరిస్థితులపై సమగ్ర పాఠాలను రూపొందించనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ చేపట్టిన చర్యలు దాదాపుగా పూర్తికావచ్చాయి. ముఖ్యంగా ప్రాథమికోన్నత స్థాయిలో తెలుగు, సాంఘిక శాస్త్రాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ కృషి.. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పోరాటంపై పాఠ్యాంశాలు ప్రముఖంగా ఉండవచ్చని సమాచారం. హైదరాబాద్ సంస్థానం, నిజాం పాలనలో పోరాటాలు, భారత్‌లో సంస్థానం విలీనం, 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రజా ప్రభుత్వం, 1953 నాటి ఘటనలు, 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలకు సంబంధించిన పోరాటం, ఉస్మానియా విద్యార్థుల పాత్ర, 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం, 1990 ప్రాంతంలో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు, 1996 నవంబరు 1న తెలంగాణ విద్రోహ సభ, 1997లో తెలంగాణ రాష్ట్ర జన సభ, ఉద్యమంలో టీఎన్‌జీవోల పాత్ర తదితర అంశాలు వివిధ తరగతుల్లో పాఠ్యాం శాలుగా ఉండనున్నాయి.
ఇక 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, అందుకు దారితీసిన పరిస్థితులు, ఉద్యమరీతి, అప్పటి ఉద్యమ నేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిరవధిక దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వంటి వాటిని బోధించనున్నారు. హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం, నిజాం పాలన , క్విట్ ఇండియా ఉద్యమం, ముఖ్యంగా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన(1911-1948)లో పరిస్థితులు, సమస్యలతోపాటు రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలపై పాఠాలు ఉంటాయి.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్రజనసభ, ఆంధ్ర మహాసభ పోరాటాలు, రావినారాయణరెడ్డి, మాడపాటి హనుమంతరావు, రామానందతీర్థ పోరాటాలను వివరించనుంది. రైతు సంఘం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ముగ్దుం మొయినుద్దీన్, షేక్ బందగీ, విస్నూర్ రాంచంద్రారెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య తదితరుల పాత్రపై పాఠ్యాంశాలు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని కూడా చేర్చాలని ఆపార్టీ ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి ఇటీవలే విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు.