గజ్వేల్‌ జేజేల కోసం.. | Gajwel Telangana Assembly Constituency Election 2023 | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌ జేజేల కోసం..

Published Fri, Nov 17 2023 3:02 AM | Last Updated on Fri, Nov 17 2023 3:02 AM

Gajwel Telangana Assembly Constituency Election 2023 - Sakshi

యెన్నెల్లి సురేందర్‌ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్‌ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్‌ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. 

 కేసీఆర్‌ : అభివృద్ధి ఎజెండా 
ఈటల : బీసీ మంత్రం 
నర్సారెడ్డి : లోకల్‌ ఫ్లేవర్‌

అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం 
‘సెంటిమెంట్‌’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్‌ గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్‌ వద్ద కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్‌ మిషన్‌ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్‌ హబ్‌ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి.

గజ్వేల్‌ గడ్డ.. కేసీఆర్‌ అడ్డా అంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్‌లెవల్‌ మేనేజ్‌మెంట్‌ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. 

ప్రజా ఉద్యమాలకు ఊపిరి... 
గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్‌ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. 

నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం 
గజ్వేల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్‌ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో  10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే  పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు హామీ ఇస్తున్నారు. 

ఈటల ముమ్మర ప్రచారం 
బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు  ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. 

కాంగ్రెస్‌ అభ్యర్థి ’లోకల్‌’ 
కాంగ్రెస్‌ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్‌ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement