వనపర్తి క్రైం: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరాల కోసం తప్ప.. దేనికీ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు రోడ్లపైకి ఎవ్వరినీ రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. సోమవారం ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించారు. ఇదే సందర్భంలో పేదలు బయటకు రాకుండా, పనులకు వెళ్లకుండా ఉంటే కుటుంబపోషణ భారమవుతుందని భావించిన ప్రభుత్వం బియ్యం, నగదు పంపిణీ చేస్తామని తెలిపింది. ప్రతి రేషన్‌కార్డుపై నెలకు సరిపడే (ఒక్కో కుటుంబానికి 12కిలోలు), నిత్యావసర సరుకుల కోసం రూ.1500 నగదు అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో జిల్లాలో లబ్ధిదారులకు రూ.23.12కోట్ల నగదు పంపిణి చేయనున్నారు. జిల్లాలోని 1,54,165 రేషన్ లబ్ధిదారులకు 18.499 క్వింటాళ్ల బియ్యం అందనుంది. నేటి నుంచి అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో 1,54,165 రేషన్‌కార్డులు
జిల్లాలో 1,54,165 రేషన్ కార్డులు ఉండగా.. అందులో 114 అన్నపూర్ణకార్డులు, 9,871 అంత్యోదయ కార్డులు, 1,44,180 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. జిల్లాలో 5,19,160 యూనిట్లు ఉండగా.. ఒక్కో కుటుంబానికి 12కిలోల చొప్పున 6229.92 మెట్రిక్ టన్నుల (18.499 క్వింటాళ్ల బియ్యం) పంపిణీ చేయాల్సి ఉంది. వీటితోపాటు నిత్యావసర సరుకుల కోసం రేషన్‌కార్డుకు రూ.1500 చొప్పున జిల్లాకు రూ.23కోట్ల 12లక్షల 47వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. వీటిని ఈ రెండు, మూడు రోజుల్లో అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికే రేషన్ బియ్యం జిల్లాకు చేరే అవకాశం ఉందని డీఎస్‌ఓ రేవతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment