సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం ఎదురు చూశారు... ఎట్టకేలకు పదోన్నతి పొందారు... పక్షంలో పోస్టింగ్ అనుకున్నారు... రెండు నెలలుగా కనీసం జీతాలు కూడా లేకుండా పని చేస్తున్నారు... ఆగస్టులో ఇన్‌స్పెక్టర్ నుంచి పదోన్నతి పొందిన డీఎస్పీల పరిస్థితి ఇది. ఇప్పటి వరకు పోస్టింగ్స్ లేకపోవడంతో వీరికి జీతాలు చెల్లించడానికి సాంకేతిక అంశాలు అడ్డు వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 68 మంది డీఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో కొత్తగా డీఎస్పీలు అయిన వాళ్ళు కేవలం 14 మంది మాత్రమే. మిగిలిన 39 మంది డీఎస్పీలు ఇంకా ఎదురు చూస్తున్నారు. పోలీసు విభాగంలో జీతాల చెల్లింపు అధికారి ఆధారంగా కాకుండా పోస్టు ఆధారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏ పోస్టు కేటాయించాలన్నా, సృష్టించాలన్నా దానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఓ అధికారి ఏ పోస్టులో పనిచేస్తుంటే దానికి సంబంధించిన జీతం ఆయనకు అందుతుంది. ఆగస్టు వరకు ఇన్‌స్పెక్టర్లుగా వివిధ పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన 53 మందికి ఆ నెల 29న పదోన్నతులు వచ్చాయి. వీరిలో 1995తో పాటు 1996 బ్యాచ్‌కు చెందిన వారూ ఉన్నారు.
అప్పటివరకు ఆయా ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్‌హెచ్‌ఓ), ప్రత్యేక విభాగాల్లోని పోస్టుల్లో పనిచేసిన వీరిని పరిపాలన పరమైన కారణాల నేపథ్యంలో ఎటాచ్‌మెంట్ పద్ధతితో అక్కడే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండి, ఆ తర్వాత పోస్టింగ్స్ వస్తాయని అధికారులు భావించారు. అయితే ఆ తర్వాత వరుసగా దసరా, ఆర్టీసీ సమ్మె వంటివి రావడంతో వీళ్ళంతా ఎటాచ్‌మెంట్ మీదే కొనసాగుతున్నారు. దీంతో ఇన్‌స్పెక్టర్ పోస్టులో వీళ్ళు లేకపోవడం, డీఎస్పీగా పోస్టింగ్ రాకపోవడంతో జీతాలు చెల్లించడానికి సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో సెప్టెంబర్ నెల జీతాలు అందని వీరికి అక్టోబర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ పదోన్నతి పొందిన అధికారుల స్థానాల్లో ఇన్‌స్పెక్టర్లుగా వేరే అధికారుల్ని నియమించారు. దీంతో ఆ పోస్టు కూడా పోయి కేవలం సూపర్ వైజింగ్ ఆఫీసర్లుగా మారిపోయారు.
శుక్రవారం 68 మంది డీఎస్పీల బదిలీలు జరిగినా వీరిలో 14 మంది మాత్రమే పదోన్నతి పొందిన అధికారుల్లో ఉన్నారు. మిగిలిన వారంతా గతం నుంచి డీఎస్పీలుగా పనిచేస్తున్న వారే. దీంతో ఆగస్టులో పదోన్నతి పొందిన వారిలో ఇంకా 39 మందికి పోస్టింగ్స్ దక్కలేదు. ఇలా జీతాలకు దూరంగా ఉన్న అధికారులకు పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడ చేరి పాత జీతం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టింగ్ వచ్చిన 14 మందికీ అక్టోబర్ నెలలో జీతం అందే అవకాశం లేదు. వీరికంటే ఆలస్యంగా ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన సబ్–ఇన్‌స్పెక్టర్లకు కొన్ని రోజుల్లోనే పోస్టింగ్స్ రావడంతో జీతం ఇబ్బంది తప్పింది. మరోపక్క దాదాపు ఆరు నెలల క్రితం పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు సైతం పోస్టింగ్స్ లేకుండా ఉన్నారు. ఫలితంగా అదనపు డీజీగా పదోన్నతి పొందిన వారు ఐజీ పోస్టులు, డీఐజీగా పదోన్నతి పొందిన వారు ఎస్పీ పోస్టుల్లో కొనసాగుతున్నారు. అయితే వీరికి జీతాల చెల్లింపులో ఇబ్బంది లేదని, తమకు మాత్రం జీతాలు కూడా అందట్లేదని కొత్త డీఎస్పీలు వాపోతున్నారు.
చదవండి: 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం
Comments
Please login to add a commentAdd a comment