* తెలంగాణ విద్యా మంత్రి జగదీశ్ రెడ్డి
* షెడ్యూల్ ప్రకటించి ఏపీ ప్రభుత్వం తప్పు చేసింది
* చట్టాలను, జీవోలను లెక్కచేయని అలవాటు వారిది
* ఏపీ ఆ ప్రకటన రద్దు చేసుకుని, కోరితే వారికి సేవలు అందిస్తాం
* 15 శాతం ఓపెన్ కోటాలో ఆ రాష్ట్ర విద్యార్థులకు అవకాశం
* చట్ట ప్రకారం చర్యలు చేపడతామని గవర్నర్‌కు వివరణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ విషయంలో ఎలాంటి ఆందోళనలు, అనుమానాలు అవసరం లేదని.. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహణ అధికారం తెలంగాణదేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టంలోని నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంసెట్‌ను తామే నిర్వహిస్తామని గవర్నర్‌కు తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్‌ను ఉపసంహరించుకుని, తమను నిర్వహించాలని కోరితే... సేవలు అందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి కలసి... ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని నిబంధన ల ప్రకారం ఎంసెట్‌ను తామే నిర్వహిస్తామని గవర్నర్‌కు తెలియజేసినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నిబంధనల ప్రకారం 15 శాతం ఓపెన్ కోటాలో పదేళ్లపాటు ఏపీ విద్యార్థులకు అవకాశం ఇస్తామని, ఇందుకోసం ప్రవేశాల కమిటీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని సభ్యుడిగా చేర్చేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు గవర్నర్‌కు వివరించానని తెలిపారు.
దీనిపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సెట్స్ తేదీలను ప్రకటించి ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యా మండలి తప్పు చేశాయని పేర్కొన్నారు. ఈ విషయం కూడా గవర్నర్ దృష్టికి వెళ్లిందని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలు లేకుండా, సాఫీగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని గవర్నర్ సూచించారని... తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎలాంటి పొరపాటు జరగదని ఆయనకు వివరించానని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
అనుమానాలకు ఆస్కారం లేకుండా..
ఎంసెట్ ప్రవేశాల్లో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు అమలవుతున్న ప్రవేశాల విధానాన్ని కొనసాగిస్తామని తమ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33లోనే చెప్పినట్లు వెల్లడించారు. గతంలో ఉన్నట్లుగానే 15 శాతం ఓపెన్ కోటాను కొనసాగిస్తున్నామని, ఇందులో తెలంగాణ విద్యార్థులతోపాటు ఏపీ విద్యార్థులకు కూడా మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తామని తెలిపారు. అయితే ఇందుకోసం ఏపీ విద్యార్థులు తెలంగాణ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే ఈ పరీక్షలకు తాము ఏపీలో కేంద్రాలు ఏర్పాటు చేయబోమని.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మన విద్యార్థులు వెళ్లి రాస్తున్న తరహాలో ఏపీ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు రాయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఏపీ కూడా అక్కడి విద్యా సంస్థల్లోని ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇంటర్ బోర్డు కూడా తెలంగాణదేనని, ఏపీలోనూ మేం పరీక్షలను నిర్వహిస్తామని చెప్పినా వినకుండా... వారు ముందే షెడ్యూల్ విడుదల చేసుకున్నారని పేర్కొన్నారు.
60 ఏళ్లుగా ఏ చట్టాలను లెక్క చేయకుండా, చేసిన చట్టాలు, జీవోలను అమలుచేయని అలవాటు వారిదని వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా తెలంగాణ ఏర్పాటయిందన్న విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణను వారు గుర్తించాల్సిన అవసరం లేదని, కేంద్రం ప్రభుత్వం గుర్తించిందని స్పష్టం చేశారు.
నేడు తెలంగాణ సెట్స్ ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించబోయే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల (సెట్స్ షెడ్యూల్)ను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాల అధికారులు, హైదరాబాద్ జేఎన్‌టీయూ అధికారులతో చర్చించి... మే 3వ తేదీన ఎంసెట్ నిర్వహించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి పాలకమండలి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశంలో సెట్స్ తేదీలతోపాటు ఏయే సెట్‌ను ఏయే విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందన్న విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.
ఎంసెట్‌పై అధికారం మాదే
Published Sat, Jan 3 2015 2:11 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement
Advertisement