ఈసారి భారీ సంక్షేమ బడ్జెట్
‘సాక్షి’తో ఆర్థిక మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్‌లోనూ సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అన్ని వర్గాలనూ స్పృశించేలా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తొలిసారిగా ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా కొత్త బడ్జెట్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో 2017–18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ఈటల ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు.
⇔ బడ్జెట్ భారీగానే ఉంటుందా, లేక వాస్తవికతకు దగ్గరగా ఉంటుందా? ఈసారి ప్రాధాన్యాలేమిటి?
ఈటల: కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణలో గణనీయమైన వృద్ధి రేటు ఉంది. తదనుగుణంగానే బడ్జెట్ అంచనాలు పెరుగుతాయి. పనుల వేగం కొనసాగేలా బడ్జెట్ ఉంటుంది. ఈసారి అన్ని వర్గాల సంక్షేమానికీ పెద్దపీట వేస్తాం. సంక్షేమానికే తొలి ప్రాధాన్యం. రెండోది విద్య, వైద్యం. మూడోది వ్యవసాయం, సాగునీరు. గ్రామీణ ఆర్థికవృద్ధికి తోడ్పడే సామాజిక వృత్తుల పునరుద్ధరణ, అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ) చేయూతనిచ్చే కార్యక్రమాలుంటాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా కార్యాచరణ ఉంటుంది.
⇔ గతేడాది ఆశించిన ఆదాయం సమకూరిందా? అంచనాలేమైనా తప్పాయా?
ఈటల: గత ఏడాది రూ.1.3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించుకున్నాం. భూముల అమ్మకంతో రూ.15 వేల కోట్లు వస్తుందని ఆశించగా అలా రాలేదు. ఆ మేరకు ఆదాయం తగ్గినట్లే. మిగతా ఆదాయానికి ఢోకా లేదు. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులొచ్చాయి. దాదాపు రూ.10 వేల కోట్ల సీఎస్‌టీ బకాయిల పరిహారం మాత్రం వచ్చేలా లేదు.
⇔ నోట్ల రద్దు నిర్ణయం ఖజానాను ప్రభావితం చేసిందా? ఆదాయానికి ఏ మేరకు గండి పడింది?
ఈటల: వాహన రంగం, స్టాంపులు–రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడింది. కానీ మిగతా వాటిలో పుంజుకోవ డంతో సమర్థంగా బయటపడ్డాం.
⇔ జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వస్తుంది కదా. దానితో రాష్ట్రానికి లాభమా, నష్టమా?
ఈటల: జీఎస్‌టీతో ఆదాయం తగ్గేది లేదు. వృద్ధి రేటు 14 శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం నుంచి పరిహారం అందుతుంది. మన వృద్ధి రేటు అంతకంటే ఎక్కువే ఉంది గనుక పరిహారం రాదు. అయినా నష్టమేమీ రాదు. ఒకే పన్ను విధానంతో మున్ముందు ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం.
⇔ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపులెలా ఉంటాయి? ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారా?
ఈటల: సబ్ ప్లాన్‌కు చట్ట ప్రకారమే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి పేరిట ప్రత్యేకంగా నిధి పొందుపరుస్తాం. వీటిని ఆయా వర్గాలకు ఖర్చు చేయటం లేదని, వేరే వాటికి మళ్లిస్తున్నారనే అపోహలు న్నాయి. అలాంటి పరిస్థితి లేకుండా పారదర్శకంగా ఖర్చు చేస్తాం. ఈ ఏడాది ఖర్చవకపోతే అంతమేరకు వచ్చే ఏడాది అదనంగా కేటాయిస్తాం. ఇది క్యారీ ఫార్వర్డ్ విధానం కాదు.
⇔ రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతున్నాయన్న విమర్శలపై మీరేమంటారు?
ఈటల:పరిమితికి లోబడి అప్పులు తీసుకుంటాం. పథకాల వేగానికి అనుగుణంగా బడ్జెటేతర నిధులు సమకూర్చుకుంటాం. అందులో తప్పేమీ లేదు.
⇔ సాగునీటికి, డబుల్ బెడ్రూం ఇళ్లకు భారీగా కేటాయింపులుంటాయా?
ఈటల:ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయించాం. దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈసారి కూడా భారీగా నిధులు కేటాయిస్తాం. కేటాయింపులే కాకుండా బడ్జెటేతర ఖర్చు కూడా బాగానే ఉంటుంది. సాగునీరు, మిషన్ భగీరథ, హార్టికల్చర్, గొర్రెలు, చేపల పెంపకం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి వీటిని ఖర్చు చేస్తాం. ఎఫ్‌ఆర్‌బీం రుణ పరిమితుల దృష్ట్యా వీటిని వెల్లడించలేం. ఇళ్ల నిర్మాణం రెండేళ్లలో పుంజుకుంటుంది.