
సాక్షి, హైదరాబాద్ : కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయడం, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. సోమవారం ఉదయం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బస్సులలో చేరుకొని ధర్నాకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా బస్సులు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్టీఏ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మొహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నాను విరమించబోమని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ తేల్చి చెప్పింది.
బార్డర్ టాక్స్ ఏడాది పాటు రద్దు చేయాలి
ఆంధ్ర, తమిళనాడు, కేరళకు వేళ్లే వాహనాల బార్డర్ టాక్సులు రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బస్సులు రోడ్డు ఎక్కలేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు.