వారం రోజుల పాటు సస్పెన్షన్కు గురైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు.
హైదరాబాద్ : వారం రోజుల పాటు సస్పెన్షన్కు గురైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. కాగా ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ మధుసుదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. చెరువుల అభివృద్ధిపై ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. మరోవైపు సస్పెన్షన్‌కు గురై మళ్లీ సభలోకి ఎంటర్ కానున్న వేళ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిన్న పార్టీ అధినేత చంద్రబాబుతో భేటి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో దాదాపు మూడు గంటలపాటు సమాలోచనలు సాగాయి.
అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ వ్యవహారిస్తున్న తీరును అధినేతకు ఎమ్మెల్యేలు వివరించినట్టు సమాచారం. ఫిరాయింపుల వ్యవహారం ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించినా ఇంతవరకు స్పీకర్, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయకపోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని స్పష్టం చేసినట్టు సమాచారం. తక్షణం ఫిర్యాదు చేయాలని, అవసరమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.