తల్లి నీలమ్మాళ్‌ను కలిసిన కుమారులు, కుమార్తెలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భర్తపై క్షణికావేశంతో ఆమె ఇల్లు వదిలి వెళ్లింది. రాష్ట్ర సరిహద్దులు దాటినా కుటుంబంపై మమకారం మాత్రం ఆమెను వీడలేదు. కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలను వదిలివచ్చేశానన్న దుఃఖంతో మతిస్థిమితం కోల్పోయింది. అనాథలా ఊళ్లు తిరిగింది. 26 ఏళ్ల తరువాత బిడ్డల చెంతకు చేరింది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అంజయ్య భార్య నీలమ్మాళ్ (60). ఈ దంపతులకు సంతోష్‌కుమార్ (34), రాజేష్‌ఖన్నా (32), కవిత (33), మయూరి (30) సంతానం. భర్త అంజయ్య ఏడేళ్ల క్రితం మరణించారు.
పిల్లలకు 4 నుంచి 8 ఏళ్ల వయసులో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నీలమ్మాళ్ ఇల్లు వదిలి బెంగళూరులోని ఒక ఇంటిలో పనిమనిషిగా చేరింది. కొంతకాలానికి మతిస్థిమితం తప్పడంతో బెంగళూరును వదిలి అనేక ప్రాంతాలు తిరిగింది. గతేడాది ఫిబ్రవరిలో చెన్నై ఈస్ట్‌కోస్ట్‌రోడ్డులోని పన్నయూరు బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి ప్రజలు తమిళనాడు నేర రికార్డుల ట్రెజరీ పోలీసుల సహకారంతో ఆమెను ‘లిటిల్ హార్ట్స్’అనే అనాథ శరణాలయానికి చేర్చారు. వైద్యచికిత్సలతో ఆమెకు ఇంటి చిరునామా గుర్తుకువచ్చింది. దీంతో చెన్నై పోలీసులు ఇక్కడి పోలీసుల సహకారంతో నీలమ్మాళ్ పిల్లల్ని చెన్నైకి రప్పించి ఆమెను వారికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment