సస్పెన్షన్‌పై తర్జనభర్జన
22 వరకే సాగనున్న అసెంబ్లీలో తమ గళం లేకుండా పోతుందని టీడీపీ ఆందోళన
ఇతర పార్టీల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం
హైదరాబాద్: శాసనసభలో హల్‌చల్ చేయడం ద్వారా రెండు రోజులు పతాక శీర్షికలకెక్కిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ప్రస్తుత పరిస్థితి మింగుడు పడడం లేదు. నిజామాబాద్ ఎంపీ కవితపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, క్షమాపణ చెప్పిన తరువాతే బడ్జెట్‌పై ప్రసంగించాలని సభా నాయకుడు కేసీఆర్ సహా ఇతర పార్టీల సభ్యులు కూడా చేసిన సూచనను వ్యతిరేకించి పది మంది సభ్యులు వారం రోజులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈనెల 21 వరకు సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతుంది. కానీ 22తో శాసనసభా సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ పరిణామం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. బడ్జెట్‌పై ప్రసంగం సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆపార్టీకి బడ్జెట్‌పై చర్చించే అవకాశమూ రాలేదు. మిగతా ఐదు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే జనం తెలుగుదేశం పార్టీని మరిచిపోతారేమోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైంది.
ఇతర పార్టీల నుంచి మద్దతు : సభ నుంచి టీడీపీ సభ్యులు వారం రోజుల సస్పెన్షన్‌కు గురైన రోజు సీఎల్‌పీ నేత జానారెడ్డి, బీజేపీ నాయకులు సుతిమెత్తగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. అయితే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు మాత్రం రేవంత్ పశ్చాత్తాపం వ్యక్తంచేస్తే తప్ప మెజారిటీ సభ ఒప్పుకోదని కుండబద్ధలు కొట్టారు. తరువాత రెండు రోజులు టీడీపీ మిగతా సభ్యులు ఆర్. కృష్ణయ్య, కృష్ణారావు, బీజేపీ నేత లక్ష్మణ్‌తో పాటు కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క తదితరులు 10 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. అయినా ప్రభుత్వం తన పంథాను మార్చుకోలేదు. సోమవారం బీజేపీ, టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతనే ఎజెండాగా చేపట్టే అవకాశాలున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. సీఎల్‌పీ నేత జానారెడ్డితో పాటు సభ్యులు ప్రభుత్వంపై ఒత్తి డితెచ్చేలా వ్యూహం సాగిస్తున్నట్లు సమాచారం.