తెలుగు మీడియంలో ఎస్జీటీలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఖాళీల ప్రకారం ఎంపికైన వారికి పోస్టింగ్ ఉత్తర్వులు అందజేయనున్నారు.
– విద్యారణ్యపురి
సాక్షి, వరంగల్ : టీఆర్‌టీ – 2017 ద్వారా చేపట్టిన నియామకాలకు సంబంధించిన ఎస్జీటీ ఫలితాలను కొన్ని నెలల క్రితమే వెల్లడించినా పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ఎట్టకేలకు తెలుగు మీడియంలో ఎస్జీటీలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తాజాగా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కాగా ఈ నెల నేడు అభ్యర్థుల జాబితాను వెల్లడించి కౌన్సెలింగ్ జరిగే ప్రదేశాన్ని కూడా ప్రకటిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సంబంధిత ఖాళీలను గుర్తించనుండగా.. ఈ నెల 24న(రేపు) ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖాళీల జాబితా ప్రదర్శిస్తారు. ఈ నెల 25, 26వ తేదీల్లో టీచర్ రిక్రూట్‌మెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను డీఈఓ పర్యవేక్షణలో పరిశీలిస్తారు. ఈనెల 28, 29వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేయనుండగా.. 30న వారు పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఇక నవంబర్ 2వ తేదీ వరకు ఎవరైనా కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక ఉత్తర్వులు పంపిస్తారు.
46 పోస్టుల భర్తీ
టీఆర్‌టీ 2017లో నోటిఫికేషన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 82 ఎస్జీటీ పోస్టులు కేటాయించారు. వాటిలో ఏజెన్సీ ప్రాంతంలోని తెలుగు మీడియంలో 36 పోస్టులు, మైదాన ప్రాంతంలో 10 పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. నేడు వెల్లడించే అభ్యర్థుల జాబితా ప్రకారం ఎంత మందిని ఎంపిక చేశారనేది తెలుస్తుంది. ఇంగ్లిష్ మీడియం ఏజెన్సీ ప్రాంతంలో 26, మైదాన ప్రాంతంలో 10 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా పలు కారణాలతో వారికి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వడం లేదు. దీంతో వారి ఎంపిక జాబితాను వెల్లడించడం లేదు.
632 ఖాళీలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 632 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో నుంచే ఈ కౌన్సెలింగ్ సందర్భంగా వివిధ పాఠశాలల్లోని ఎస్‌జీటీ ఖాళీలను చూపనున్నారు. ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు చూపుతారనేది కౌన్సెలింగ్ సందర్భంగా వెల్ల్లడికానుంది.
Comments
Please login to add a commentAdd a comment