కబ్జాల ఖాతాలో.. దేవుడి భూములు జమ! | Temples Land Are In Kabza Across Telangana | Sakshi
Sakshi News home page

కబ్జాల ఖాతాలో.. దేవుడి భూములు జమ!

Published Sat, May 18 2019 1:39 AM | Last Updated on Sat, May 18 2019 1:40 AM

Temples Land Are In Kabza Across Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేముడి సొమ్మే కదా అని తేరగా స్వాహా చేసిన కబ్జాదారుల లెక్క తేల్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయ మాన్యం దాదాపు 87వేల ఎకరాలదాకా ఉంది. వీటిలో 24వేల ఎకరాల మేర అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంది. గుట్టు చప్పుడుగాకుండా గుడిని గుడిలో లింగాన్ని మింగేసే ఈ కబ్జాబాబుల దర్జాకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుంది. ధూప,దీప నైవేద్యం, దేవాలయాల పరిరక్షణ కోసం దాతలు వితరణ చేసిన భూములను పర్యవేక్షించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహించింది. దీంతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.కొన్ని చోట్ల లీజుదారుల కబంధహస్తాల్లో భూమి చిక్కుకుపోయింది. భూములపై నిర్దిష్ట సమాచారం లేకపోవడం, సర్వే నిర్వహించకపోవడంతో భూబకాసురుల చెర నుంచి విముక్తి చేయలేకపోయింది.ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఆలయాల భూముల లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలవారీగా మాన్యాల వివరాలను సేకరించిన దేవాదాయశాఖ.. వాటిని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.అలాగే విలువైన భూములను లీజుకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. సెల్‌ టవర్లు, దుకాణ సముదాయాలు, ఇతరత్రా వాణిజ్యావసరాలకు స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయం ఆలయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.  

24వేల ఎకరాలు హాంఫట్‌! 
విలువైన దేవాలయ భూములకు రెక్కలొచ్చాయి. ప్రజాప్రతినిధులు మొదలు బడాబాబుల వరకు ఈ స్వాహాపర్వాన్ని కొనసాగించారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం కేంద్రంలోని సొమలింగేశ్వర స్వామి భూమి, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని వేణుగోపాలస్వామి మాన్యాలు కూడా కబ్జాకోరల్లో చిక్కుకున్నవే. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా 24వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,500 ఎకరాలు, హైదరాబాద్‌లో 2,200 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 1,800 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇందులో ఏకంగా 16వేల ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. 

భూముల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్‌ 
దేవాలయ భూముల లెక్క తేల్చడానికి దేవాదాయ శాఖ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించింది. గత నెలలో దేవాలయాలవారీగా భూముల వివరాలను సేకరించింది. దేవుడి పేరిట భూములను దానం చేస్తే వాటి వివరాలను 43 రిజిష్టర్‌లో దేవాదాయ శాఖ నమోదు చేస్తుంది. ఇలా నోటిఫై చేసిన భూములపై సర్వహక్కులు దేవాదాయశాఖకే ఉంటాయి.వాటి వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకునేందుకు తాజాగా ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. 43 రిజిష్టర్‌లో నమోదైన భూమిలో ఎంతమేర కబ్జా అయ్యింది? ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? ఇనాం/కౌలు దారులున్నారా? తదితర సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తించిన మాన్యాలను కాపాడుకునేందుకు ప్రహారీగోడలు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తోంది.

అలాగే భూమిలో దేవాదాయ భూమిగా పేర్కొంటూ బోర్డులను పెడుతోంది. కాగా, ఇంకా 43 రిజిష్టర్‌లో నోటిఫై చేయని, ఇటీవల ఎక్కడైనా దానం చేసిన భూమి ఉంటే వాటి వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటోంది. రికార్డులను పకడ్బందీగా రూపొందించిన అనంతరం భూ సర్వే జరపాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో తేలిన దేవాలయాల భూముల జాబితాను పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ.. తమవద్ద ఉన్న లెక్కలతో సరిచూసుకుంటోంది. వీటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. భూ సర్వేకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ, సర్వే సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నందున.. జూన్‌లో ప్రతి దేవాలయ భూమిని సర్వే చేయించాలని నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement