
జవహర్‌నగర్‌లో ఉద్రిక్తత
జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీనగర్ కాలనీలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కొన్నాళ్లుగా అరాచకాలు సృష్టిస్తూ మహిళలను వేధిస్తున్న చింత శేఖర్‌ను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు ఆదివారం సాయంత్రం సమావేశమై ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. చింత శేఖర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయన వర్గీయులు కాలనీవాసులపై రాళ్లు రువ్వడంతో కొందరు మహిళలు గాయపడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు దాదాపు 600 మంది ఒక్కసారిగా ఆయనపై ఇంటిపై దాడి చేశారు. కారు అద్దాలు, ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పన్నెండేళ్లుగా చింత శేఖర్ కాలనీవాసులపై దౌర్జన్యాలు చేశాడని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు.
కాగా ఇటీవల చింత శేఖర్ అదృశ్యమయ్యాడని ఆయన కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారని, అదంతా నాటకమని వారు మండిపడ్డారు. చింత శేఖర్ ఇటీవల దసరా పండుగ నేపథ్యంలో స్థానికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేశారని, ఆయనను వెంటనే అధికారులు గ్రామ బహిష్కరణ చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇరువర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటగిరి, ఎస్‌ఐలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఠాణాకు తీసుకెళ్లారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెంకటగిరి పేర్కొన్నారు.