సెక్షన్-8పై చట్టబద్ధంగా పోరాడతాం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
సాక్షి, హైదరాబాద్: సెక్షన్-8 విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తాము రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడతామని వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఏసీబీ ఇచ్చే నోటీసులు తీసుకోనని చంద్రబాబు మొండికేస్తే, మెడపట్టి లోపలేస్తరన్నారు. సచివాలయంలో మంగళవారం తలసాని విలేకరులతో మాట్లాడుతూ ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య తలెత్తిందా అని ప్రశ్నించారు. ‘నైజీరియా దేశస్తుడు హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కితే మీరెవరు అరెస్టు చేయడానికి అని అడుగుతారా? తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నారు.
పుకార్లు పుట్టిస్తున్నరు: కేకే
సెక్షన్-8 పై కొన్నివర్గాలు అనవసర పుకార్లు ప్రచారం చేశారని, గవర్నర్‌కు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఒక దొంగ దొరికాడు. దొంగ వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసుకునే పనిలో ఏసీబీ ఉంది’ అని అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ... ఏసీబీ చట్టం ప్రకారమే నడుచుకుంటుందని పేర్కొన్నారు. స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని, టేపుల్లో ఉన్న గొంతు తనదో కాదో ఆయన చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని వివరించిన కేకే .. తెలంగాణ తమ అబ్బ జాగీరేనని, బద్మాష్ పనులు చేయమని చట్టం చెప్పదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
దొంగలు, నేరస్తులకు ఏపీ అడ్డా: జీవన్‌రెడ్డి
దొంగలు, నేరస్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డాగా మారుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో దొంగలకు దుబాయ్ అడ్డాగా మారిన చందంగా దేశంలో ఏపీ తయారవుతోందని ఎద్దేవా చేశారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు ఏపీ చంద్రబాబు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో 15 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా ఉన్నప్పుడు, సెక్షన్-8తో పని లేదన్నారు.
అమలు చేస్తే అగ్నిగుండమే: న్యూడెమోక్రసీ
హైదరాబాద్‌లో సెక్షన్-8ను ప్రయోగిస్తే తెలంగాణ అగ్గిలా మండుతుందని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ-చంద్రన్న నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాజధానిలో దీన్ని ప్రయోగించడమంటే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర హక్కులను హరించడమేనని అన్నారు. చంద్రబాబు, కేంద్రప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, తెలంగాణ ప్రజలు ఈ నిరంకుశ సెక్షన్ అమలును ప్రతిఘటించి తీరుతారన్నారు.
మళ్లీ పరువు తీసుకోవద్దు
ఏపీ సీఎం బాబుకు మంత్రి తుమ్మల హితవు
సెక్షన్-8 ను మళ్లీ తెరపైకి తీసుకురావడం దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే చర్య అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. నీతిమాలిన రాజకీయాలకు పాల్పడి మరోసారి పరువు తీసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన హితవుపలికారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలకు ఉన్న హక్కులే తెలంగాణకు కూడా ఉంటాయన్నారు. దొంగతనం చేసిన వ్యక్తి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో అసహ్యమైన పనికి దిగజారుతున్నారని, చంద్రబాబు చర్యల వల్ల టీడీపీ పరువు బజారుకెక్కిందన్నారు.
అసత్య ప్రచారం: కిషన్‌రెడ్డి
సెక్షన్ 8పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే కుట్రలో భాగంగానే ఈ దుష్ర్పచారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. పత్రికల్లో, ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలన్నారు.
‘తప్పు కప్పిపుచ్చుకునేందుకు బాబు తంటాలు’
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు తప్పును కప్పి పుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. దొంగతనం నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు సెక్షన్-8 నాటకం ఆడుతున్నారని మండి పడ్డారు. ఈ కేసులో మత్తయ్య ఎక్కడున్నారని నోముల ప్రశ్నించారు.
సెక్షన్-8 సెగలు
Published Wed, Jun 24 2015 1:24 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement