
హత్య చేయడం తప్పుకాదట.. వీడియో తీయడం తప్పా!
హత్య చేయడం తప్పు కాదు గానీ, ఆ హత్య చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడితే, దాన్ని వీడియో తీయడం తప్పని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఒక అంశం మాత్రమేనని, కానీ తాను తప్పు చేసిన తర్వాత చంద్రబాబుకు ఆ సెక్షన్ గురించి గుర్తుకొచ్చినట్లుందని ఆయన అన్నారు. విశాఖజిల్లా అచ్యుతాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వెళ్తూ మార్గం మధ్యలో నక్కపల్లి వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగారు. పాయకరావుపేట నియోజవకర్గ సమస్యలపై పార్టీ నేతలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు ఇచ్చిన వినతిపత్రాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...
- రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న ఏకైక పార్టీ మాదే
- రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలు పంచుకున్నారు
- రాష్ట్రాన్ని విభజించాలని పార్లమెంటులో ఆయన ఎంపీలందరూ సంతోషంగా చేతులు ఊపారు
- చంద్రబాబూ.. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో మేం ఏ పార్టీకి మద్దతిస్తే నీకేంటి?
- పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలుచేయాలని కేంద్రాన్ని నాలుగుసార్లు కలిశాం
- ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ చట్టంలోని సెక్షన్ -8పై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
- లంచాలు తీసుకున్న డబ్బులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారు
- కరప్షన్ మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే