బాంబుల దాడిలో ధ్వంసమైన ఇల్లు. (ఇన్‌సెట్‌లో) పగిలిపోయిన టీవీ
తిరుమలగిరి(నాగార్జునసాగర్): నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండాలో ఆదివారం అర్ధరాత్రి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. నాటుబాంబుల మోతతో తండాలో భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. సుమారు 40 ఇళ్లు, వాటిలోని సామగ్రి ధ్వంసమైంది. తండాకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య కొంతకాలంగా రాజకీయ వైరం కొనసాగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఈ క్రమంలో ఈ నెల 13న టీఆర్‌ఎస్‌కు చెందిన స్వామి, కాంగ్రెస్‌కు చెందిన భిక్షాలు ఓ శుభకార్యానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ విషయాన్ని స్వామి తన కుమారుడు దస్రూకు చెప్పాడు. మరుసటి రోజు (ఆదివారం) సాయంత్రం దస్రూ.. తండాలో ఉన్న భిక్షాలు దగ్గరికి వెళ్లి తన తండ్రిని తిడతావా అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.
తండావాసులు ఇరువర్గాలుగా విడిపోవడంతో వాగ్వాదం కాస్త తీవ్రరూపం దాల్చింది. దీంతో ఒకరిపైఒకరు రాళ్లు, బీరు సీసాలు విసురుకున్నారు. ఆ తర్వాత చేపల వేటకు ఉపయోగించే నాటుబాంబులను ప్రత్యర్థుల ఇళ్లపై విసిరారు. దీంతో ఇళ్లలోని మనుషులు బయటికి పరుగులు తీశారు. బాంబుల ధాటికి ఇరువర్గాలకు చెందిన వారి ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్‌కు చెందిన దస్లీ, మేరావత్ సోమ్లాకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున తండాకు చేరుకున్నారు. అయితే అప్పటికే దాడులకు పాల్పడిన వారు పరారయ్యారు. నాగార్జునసాగర్ సీఐ వేణుగోపాల్, హాలియా సీఐ ధనుంజయ్‌ల ఆధ్వర్యంలో తండాలో పోలీసు పహారా నిర్వహించారు. దీనిపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తిరుమలగిరి ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment