ఇక పైపుల ద్వారా సాగు నీరు
- కాల్వలకు బదులుగా పైప్‌లైన్లు ఏర్పాటు
- మధ్యప్రదేశ్, రాజస్తాన్ తరహా విధానం అమలుకు శ్రీకారం
- రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాజెక్టుల కాల్వల స్థానంలో పైప్‌లైన్ల ద్వారా ఆయకట్టుకు సాగు నీరందించే నూతన విధానానికి శ్రీకారం చుడతామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉందని, అలాంటి విధానాన్నే అమలు చేస్తామని ఆయన అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆదిలాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల కాల్వల నిర్మాణానికి వ్యయం అధికంగా అవుతున్నందున పైప్‌లైన్ల ద్వారా సాగు నీరందిస్తే నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు భూ సేకరణ, నిర్మాణ పనుల్లో జాప్యం, ఇబ్బందులను అధిగమించవచ్చని అన్నారు. ప్రాణహిత-చేవెళ్లలోని 28వ ప్యాకేజీ కాల్వలు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు కాల్వలకు బదులుగా ఈ పైప్‌లైన్ విధానం అమలు చేసేందుకు అంచనాలు తయారు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వెంటనే నివేదిక ఇవ్వాలని అన్నారు.
ఈ ఏడాది ఎల్లంపల్లి నింపుతాం
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ ఏడాది పూర్తి స్థాయిలో 20 టీఎంసీల నీటిని నింపుతామని హరీశ్‌రావు పేర్కొన్నారు. పునరావాస చర్యలు వెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 12 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగు నీరందించేందుకు రూ.300 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని మంజూరు చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలుస్తామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు చెరువులు, ప్రాజెక్టుల పనులకు టెండర్లు వేసి, పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లు.. విశ్వప్రసాద్‌రావు, భానుప్రకాష్‌రెడ్డిలపై తక్షణం చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో ఈ గుత్తేదార్లను బ్లాక్ లిస్టులో పెట్టని పక్షంలో సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జైకా ప్రాజెక్టు డెరైక్టర్ మల్సూర్, చీఫ్ ఇంజనీర్ భగవంత్‌రావు, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మల్లన్నసాగర్‌పై ఇప్పుడు మాట్లాడను
మల్లన్నసాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను బహిర్గతం చేయకముందే భూ సేకరణ చేస్తున్నారని జేఏసీ విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానం దాటవేశారు. ‘మల్లన్నసాగర్ అంశంపై ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాను.. ఈ అంశంపై మాట్లాడితే మీడియా అంతా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తుంది.. అందుకే దాని గురించి ఇప్పుడు మాట్లాడను..’ అని సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.