ఉపాధి లేకపోవడమే అతి పెద్ద సమస్య
ప్రొఫెసర్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో యువతకు ఉపాధి లేకపోవడమే అతిపెద్ద సమస్య అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జేఏసీ నేతలు పిట్టల రవీందర్, భైరి రమేశ్, ప్రహ్లాద్ తదితరులతో కలసి జేఏసీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఉపాధి కల్పన కుఅనుసరించాల్సిన మార్గాలపై చర్చ జరగాలన్నారు. ప్రైవేటు రంగంలో ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదని పేర్కొన్నారు. పెట్టుబడులు, ప్రైవేటు పరిశ్రమల వల్ల ఉపాధి కలుగుతుందా అనేదానిపై స్పష్టత రావాలన్నారు.
నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించడానికి గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ‘తెలంగాణలో ఉపాధి అవకాశాలు’ సెమినార్ పోస్టరును కోదండరాం ఆవిష్కరించారు. కాగా, సకల జనుల సమ్మెకు ఒకరోజు ముందు కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన సభకే సింగరేణి కార్మికులు హాజరయ్యారని, ఆ కారణంతో సెలవులో ఉన్నారని వారికి సకల జనుల సమ్మె వేతనాలను ఇవ్వకపోవడం అన్యాయమని కోదండరాం పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను విలీనం చేయొద్దు...
ప్రభుత్వ రంగ సంస్థలను విలీనం చేయకుండా, వాటిని బలోపేతం చేయాలని జేఏసీ కోదండరాం కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల సమాఖ్య ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలకు హెడ్‌లను వెంటనే నియమించాన్నారు.