హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సోమవారం తీర్పు వెలువడే అవకాశముంది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి దీన్ని మార్చి 9కి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సంస్థ మాజీ సీఎఫ్‌ఓ శ్రీనివాస్ వడ్లమాని, పీడబ్ల్యూసీ ఆడిటర్లు ఎస్.గోపాలకృష్ణన్, టి.శ్రీనివాస్ సహా రామలింగరాజు మరో సోదరుడు సూర్యనారాయణరాజు, సంస్థ మాజీ ఉద్యోగులు జి.రామకృష్ణ, డి.వెంకటపతి రాజు, సీహెచ్ శ్రీశైలం, వి.ఎస్.ప్రభాకర్ గుప్తా ప్రధాన నిందితులుగా ఉన్నారు.
సత్యం కేసును తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ దీని ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క కేసు విచారణ కోసం 2010లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. సత్యం కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది.