- వారం రోజులో డెంగీతో ముగ్గురు మృతి
- విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌పై సీజనల్ వ్యాధులు మళ్లీ పంజా విసురుతున్నాయి. వర్షాకాలం ఆరంభం కావడంతో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వారం రోజుల్లోనే డెంగీతో ముగ్గురు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
మృతుల్లో యాకుత్‌పుర బాలాజీనగర్‌కు చెందిన స్వప్న(23), నందనవనం ఆదర్శ్‌నగర్‌లో ప్రశాంత్(28)తో పాటు జీడిమెట్లకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. మృతుడు ప్రశాంత్ పిల్లులు సందీప్(3), సింధూజ(4)కు ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స అందించి, రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేయగా, మున్నా(7) నిలోఫర్‌లో చికిత్స పొందుతున్నాడు. పేదల బస్తీల్లో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
చాపకింద నీరులా ‘స్వైన్ ఫ్లూ’
నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన స్వైన్‌ఫ్లూ వైరస్ నగరంలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు కాగా, కేవలం పదిహేను రోజుల్లోనే ఏడుగురు బాధితులు గాంధీ ఆస్పత్రిలో చేరడం సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది. తీవ్రమైన జర్వం, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న వారిని అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసుగా భావించి చికిత్స అందించారు. వీరి నుంచి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా, బాధితుల్లో ఒకరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.
మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు భిన్న వాతావరణం నెలకొనడంతో స్వైన్‌ఫ్లూ కారక వైరస్ వ్యాప్తికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నట్టుండి వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి, ఒంటిపై బొబ్బలు, తీవ్రమైన జ్వరం, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడం, ఒళ్లు నొప్పులు, వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే ఫ్లూగా అనుమానించి, వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
దోమల స్వైరవిహారం..
వర్షాల వల్ల నివాసాల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల నియంత్రణకు బస్తీల్లో ఫాగింగ్ కూడా చేయక పోవడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలే కాదు అర్ధరాత్రి కరెంట్ సరఫరా నిలిపివేస్తుండడంతో ఇంట్లో ఫ్యాన్లు పని చేయకపోవడం లేదు. ముఖ్యంగా మూసీ పరివాహాక ప్రాంతాలైన కూకట్‌పల్లి, లోయర్‌ట్యాంక్ బండ్, అంబర్‌పేట్, సుల్తాన్‌బజార్, ముసారంబాగ్, మలక్‌పేట్, కొత్తపేట్, నాగోలు, ఉప్పల్, రామంతాపూర్, గోల్నాక, ఉస్మానియా క్యాంపస్, తదితర బస్తీల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది.