గడువు 2 రోజులే..
మహబూబ్‌నగర్ టౌన్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ (సంబంధిత వ్యక్తుల పేర చేయించుకోవడం)ప్రక్రియ జిల్లాలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా గ్రామీణస్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు చేసుకునేందుకు ముందుకురావడం లేదు. అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం ఒకటైతే.. ప్రచారం చేయకపోవడంతో నామమాత్రపు స్పందన లభించిందని తేటతెల్లమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది.
ఇళ్లస్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం 58,59 జీఓలను జారీచేసింది. దీనికి సంబంధించి ముందుగా ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించినప్పటికీ జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కేవలం 244దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గడువును మరింత పెంచడంతో బుధవారం నాటికి 2604 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో జీఓ నెం.58 కింద క్రమబద్ధీక రణ కోసం 2549, జీఓ నెం.59 కింద 55 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.39.42లక్షల ఆదాయం సమకూరింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 1224 దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతోపాటు జీఓ నెం.59కి 17దరఖాస్తులు రాగా వీటికి సంబంధించి రూ.31,83,675 ఆదాయం వచ్చింది. అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో వచ్చాయి.
క్రమబద్ధీకరణతో మేలు
ఇళ్లు ఉన్నా ఇంకా క్రమబద్ధీకరించుకోలేని కుటుంబాలు జిల్లాలో 10వేల పైగా ఉన్నట్లు సంబంధిత అధికారుల అంచనా. జీఓ నెం.58ప్రకారం 125 గజాల లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. 125 నుంచి 250గజాల వరకు అయితే మార్కెట్ ధరలో 30శాతం ప్రభుత్వానికి ఫీజు రూపేణా చెల్లించాలి. 250 నుంచి 500గజాల వరకు ఉన్న వారంతా ధరలో 75శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే వారి స్థలాలను ఇతరులకు విక్రయించుకునే సౌలభ్యం ఉంటుంది.
ఉచితంగా క్రమబద్ధీకరించుకునేవారు విక్రయించుకునేందుకు వీలుండదు. ఒకవేళ వారు విక్రయించాల్సి వస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర కచ్చితంగా చెల్లించాలి. అవగాహన లేని కారణంగానే కొందరే దరఖాస్తులు చేసుకుంటున్నారు. క్రమబద్ధీకరణకు గడువు రెండురోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అర్హులంతా దరఖాస్తు చేసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
డివిజన్ల వారీగా దరఖాస్తులు
డివిజన్ పేరు జీఓ జీఓ ఆదాయం
నెం. 58 నెం.59
1, మహబూబ్‌నగర్ 1224 17 రూ.31,83,675
2. గద్వాల 591 18 రూ.2,85,875
3. వనపర్తి 402 2 రూ.1.20లక్షలు
4. నాగర్‌కర్నూల్ 47 10 రూ.87వేలు
5. నారాయణపేట 285 8 రూ.2,65,750
మొత్తం: 2549 55 రూ.39,42,300