సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా రాజకీయాలు క్రమంగా ఓ రూపానికి వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొంత గందరగోళంగా కనిపించిన జిల్లా రాజకీయం రూపురేఖలు మార్చుకుంటోంది. ఆయారాం, గయారాంల హడావుడి తగ్గడంతో ఇప్పుడు అన్ని పార్టీలు దాదాపు సెటిల్ అయినట్టే కనిపిస్తున్నాయి. రాజకీయ వలసల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ జిల్లాలో బలం పుంజుకుంది. టీడీపీ డీలా పడింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కొంత వలసలు కనిపించినా ముఖ్య నేతలెవరూ పార్టీ మారకపోవడంతో ఆ పార్టీ ఊపిరిపీల్చుకుంది. వామపక్షాలు ఎన్నికల వేడి నుంచి బయటపడి పోరాటాలపై దృష్టి సారించాయి.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రలో ఒదిగిపోయింది. నరేంద్రమోడీ హవాతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా బీజేపీ జిల్లా శ్రేణుల్లో మాత్రం పెద్దగా చలనం కనిపించటం లేదు. మొత్తమ్మీద రాజకీయ అల్పపీడనాలు తీరం దాటిపోయినట్టు కనిపిస్తున్నాయి. త్వరలోనే జరుగుతాయనుకుంటున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.
‘గులాబీ’ దూకుడు
జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి టీఆర్‌ఎస్‌పైనే. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇప్పుడు జిల్లాలో బలమైన పార్టీగా ఎదిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా జిల్లాలో టీఆర్‌ఎస్ బలం పుంజుకోలేకపోయినా, స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దగా బలం చాటకపోయినా, సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్నా, ఎన్నికల తర్వాత మాత్రం పార్టీ బలోపేతం అయింది. ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు జడ్పీ చైర్‌పర్సన్ ఉన్నారు.
త్వరలోనే మంత్రి పదవి కూడా లభిస్తుందని సమాచారం. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం ఖాయమని, దసరా బోనాంజాగా ఆయనకు కేబినెట్‌లో బెర్త్ లభించవచ్చని ప్రచారం. ఆయనకు ఆర్‌అండ్‌బీ లేదా రెవెన్యూశాఖ లభించవచ్చని అంటున్నారు. జిల్లాలో పార్టీ నుంచి గెలిచిన జలగం వెంకట్రావుకూ తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని కూడా సమాచారం. కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగానే తుమ్మల తన రాజకీయ ప్రత్యర్థి జలగం వెంకట్రావు నివాసానికి వెళ్లి ఇటీవల చర్చలు జరిపారని సమాచారం. ఇక ఇప్పుడు టీఆర్‌ఎస్ శ్రేణుల దృష్టి నామినేటెడ్ పోస్టులపైనే ఉంది.
సర్దుకుపోదాం రండి
తుమ్మల నిష్ర్కమణతో టీడీపీ పూర్తిగా డీలాపడినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీలో మొన్నటివరకు ముఖ్య నాయకులుగా ఉన్నవారంతా ఇప్పుడు గులాబీ గూటికి చేరడంతో మిగిలిన వారితోనే ముందుకెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. జడ్పీచైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకుని కొంత బలం పుంజుకున్నట్టు కనిపించినా చైర్‌పర్సన్ కవిత కూడా పార్టీని వీడటంతో టీడీపీలో నిస్తేజం అలుముకుంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాలుగైదు నియోజకవర్గాల ఇన్‌చార్జులు మాత్రమే పార్టీలో మిగిలారు.
అంతా ఒకటే..
గ్రూప్ గొడవలతో సతమతమైన కాంగ్రెస్ ఇప్పుడు ఏకతాటిపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రేణుక, రాంరెడ్డి, భట్టి, సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్... ఇలా అనేక మంది నాయకుల పేర్లతో గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు అధికారం కోల్పోయాక అందరం ఒకటనే భావనలో ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌పై గురిపెట్టి పనిచేయాలని నిర్ణయించుకున్న పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో కలిసే పాల్గొన్నారు. జిల్లా కేంద్రం ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ కూడా తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల గెలుపోటముల బాధ్యతను పూర్తిగా తనకే అప్పగించాలని అధిష్టానానికి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. రాజకీయ వలసల్లో భాగంగా ఒక ఎమ్మెల్యేను కోల్పోయిన కాంగ్రెస్ ప్రస్తుతానికి డీసీసీ అధ్యక్షుడి నియామకం, కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టి పనిచేస్తోంది.
మా దారి రహదారి...
సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం ఎంపీ పీఠాన్ని దక్కించుకుని మంచి జోష్ మీదున్న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎన్నికల త ర్వాత కూడా తనదైన శైలిలో ముందుకెళుతోంది. పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నా... ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఒకేతాటిపై పార్టీని నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రజాసమస్యలపై స్పందిస్తూ ముగ్గురూ క్షేత్రస్థాయి పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. పార్టీ పరంగా కూడా ముగ్గురు నేతలకు ప్రాతినిధ్యం లభించింది. జిల్లాలో పార్టీ బాధ్యతలను పొంగులేటి భుజస్కంధాలపై వేసుకొని ముందుకెళ్తున్నారు.
పోరాటాల బాటలో ఎర్రసైన్యం
ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఎప్పటిలాగే వామపక్ష పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడే పనిలో పడ్డాయి. అసంఘటిత రంగ కార్మికుల పక్షాన సీపీఐ, సీపీఎంలు ఉద్యమాలను ఉధృతం చేస్తుండగా, ఆదివాసీ గిరిజనుల హక్కులను కాపాడే క్రమంలో న్యూడెమొక్రసీ ఆందోళనలు చేస్తోంది.
‘కమలం’ వికాసం అంతంతమాత్రమే..
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం జిల్లాలో పట్టు పెంచుకోలేకపోతోంది. చరిష్మా ఉన్న నాయకులెవరూ పార్టీలో లేకపోవడం, తెలంగాణ నేతలు కూడా జిల్లాపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న స్థితిలో ఉంది కమలదళం పరిస్థితి ఉంది.
ఇక సెట్‌రైట్
Published Tue, Sep 16 2014 3:12 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement