- ముగిసిన కంటోన్మెంట్ పాలకమండలి గడువు
- ఏడాది వరకు ఎన్నికలు లేనట్లే..?
- ‘నామినేటెడ్’ ఎంపికపై ఊహాగానాలు
కంటోన్మెంట్,న్యూస్‌లైన్: కంటోన్మెంట్ చట్టం-2006 అమల్లోకి వచ్చాక సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఏర్పాటైన తొలి పాలకమండలి గడువు ముగిసింది. పూర్తి ఐదేళ్లతోపాటు, చట్టం అనుమతించిన గరిష్ట పొడిగింపు ఏడాది కలుపుకుని తాజా పాలకమండలి ఆరేళ్లపాటు కొనసాగి ఈనెల 5వ తేదీతో ముగిసింది.
ప్రస్తుతం బోర్డులో అధ్యక్షుడు సునీల్ ఎస్ బోధేతోపాటు, సభ్యకార్యదర్శిగా వ్యవహరించే సీఈవో సుజాతగుప్తా మాత్ర మే మిగిలారు. తదుపరి బోర్డు ఎన్నికలు ఆలస్యమయ్యే నేపథ్యంలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించే నామినేటెడ్ సభ్యుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏడాది వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది.
యథావిధిగా కొనసాగుతున్న మూడు బోర్డులు: దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ బోర్డులుండగా..పాలకమండలి ఉన్నవి 58 మాత్రమే. నాలుగు కంటోన్మెంట్‌లలో సామాన్య జనాభా అతితక్కువగా ఉన్నందుకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేదు. మిల టరీ అధికారుల ఆజమాయిషీలోనే పా లన ఉంటుంది. బోర్డుల ఆధ్వర్యంలో పాలన సాగే మిగతా 58 కంటోన్మెంట్‌లలో 55 బోర్డుల పదవీకాలం ఈనెల 5తో ముగిసింది.
సాధారణంగా కంటోన్మెంట్‌లలో ప్రతీటా సెప్టెంబర్ 15న తాజా ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు. అయితే విద్యాసంవత్సరం ముగింపు, బడ్జెట్ రూపకల్పన సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవచ్చని.. వచ్చే వేసవిలోనే జరగొచ్చని ఆలిండియా కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుల సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి వినోద్‌మాథూర్‌వాలా స్పష్టం చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
ఆరేళ్లలో నలుగురు: 2008 మే 18న కొలువుదీరిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలిలో నలుగురు అధ్యక్షులు, నలుగురు ఉపాధ్యక్షులు, నలుగురు సీఈవోలు మారారు. పార్టీ గుర్తుల్లేకుండా 2008లో జరిగిన ఎన్నికల్లో 8మంది సభ్యులు జంపన విద్యావతి, సాద కేశవరెడ్డి, జంపన ప్రతాప్, పి.వెంకట్రావు, అనూరాధ, భానుక నర్మద, పి.శ్యామ్‌కుమార్, జైప్రకాశ్‌లు ఎన్నికయ్యారు.