రూ.4,390 కోట్లు
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమినిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం కింద జిల్లాలోని నాలుగు గ్రిడ్‌లకు రూ.4,390 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఎస్సారెస్పీ, కడెం, కొమురంభీమ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌ల కోసం ఈ అంచనా వేశారు. మొదట జిల్లాలో ఐదు వాటర్‌గ్రిడ్‌ల కోసం అంచనాలు రూపొందించినా గడ్డెన్న వాగును తప్పించారు. ముథోల్ నియోజకవర్గం కోసం గడ్డెన్నవాగు నుంచి తాగునీటి సరఫరా కోసం రూ.163 కోట్లతో పనులు నడుస్తుండటంతో వాటర్‌గ్రిడ్‌లో దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. కాగా.. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 26 వాటర్‌గ్రిడ్‌లు నిర్మిస్తుండగా అందులో ఆరు గ్రిడ్‌లను ప్రభుత్వం పైలేట్ ప్రాజెక్టులుగా తీసుకుంది. వాటిలో జిల్లాలోని కడెం కూడా ఉంది.
కడెం సర్వే మొదలు..
కడెం ప్రాజెక్టు వద్ద వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి సర్వే మొదలైంది. 862 కిలో మీటర్లలో పైపులైన్ వేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రధాన పైపులైన్, గ్రామాలకు వెళ్లే సెకండరీ పైపులైన్ పైన పేర్కొన్న కిలో మీటర్లలో విస్తరించి ఉంటుంది.
ప్రధానంగా సర్వేలో మొదట అంచనా వేసిన విధంగా ఎన్ని కిలో మీటర్ల మేర పైపులైన్ వేయాల్సి ఉంటుంది, పైపులైన్ కోసం ఎంత ప్రభుత్వ, ప్రైవేటు భూములు సేకరించాల్సి వస్తుంది, మార్గమధ్యలో ఎన్ని కల్వర్టులు అవసరం, ఆఫ్టికల్ ఫైబర్‌లైన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందనేది అంచనా వేస్తారు. సర్వే ఆధారంగా గ్రిడ్ డిజైన్‌కు టెండర్ పిలుస్తారు. తదుపరి గ్రిడ్ అంచనా వ్యయాన్ని రూపొందిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు వాటర్‌గ్రిడ్‌లకు సంబంధించి ప్రాథమికంగా ఎన్ని కిలో మీటర్లలో పైపులైన్, అంచనా వ్యయాన్ని రూపొందించారు. సర్వే తర్వాత ఇందులో స్వల్పంగా మార్పులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వెనువెంటనే..
రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు వాటర్‌గ్రిడ్‌లను పైలేట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రస్తుతం సర్వే పనులు ప్రారంభించింది. జిల్లాలో కడెం సర్వే పనులు మొదలయ్యాయి. డిసెంబర్‌లో సర్వే పూర్తిచేసి జనవరిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చిలో పనులు ప్రారంభించాలని తలుస్తున్నారు. పైలేట్ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు కాగానే జనవరిలో మిగితా గ్రిడ్‌ల సర్వే కోసం టెండర్లు నిర్వహించి ఫిబ్రవరిలో సర్వే పూర్తి చేసి, మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి సర్వే పనులు వెనువెంటనే ఉంటాయని చెబుతున్నారు.
వాటర్‌గ్రిడ్ స్వరూపం..
తాగునీటి, ఇతర అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మనిషికి రోజుకు వంద లీటర్లు, అర్బన్‌లో 135 లీటర్ల నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రెండు నెలల కిందట ఏయే ప్రాజెక్టుల నుంచి నియోజకవర్గాలు, మండలాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుందనేది ప్రాథమికంగా అంచనా వేశారు. 2030 సంవత్సరం జనాభాకు అనుగుణంగా తాగునీటి అసవరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు అవసరమవుతాయో కూడా నిర్ధారించారు.
ఎస్సారెస్పీ నుంచి నిర్మల్‌లోని ఐదు మండలాలు, బోథ్‌లో ఏడు, ఆదిలాబాద్‌లోని మూడు మండలాలకు కలిపి 2.8 టీఎంసీలు, ఎల్లంపల్లి కింద మంచిర్యాలలోని మూడు, చెన్నూర్‌లోని నాలుగు, బెల్లంపల్లిలోని ఆరు మండలాలు కలిపి 1.673 టీఎంసీలు, కొమురంభీమ్ కింద సిర్పూర్(టి) నియోజకవర్గంలో ని ఐదు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు కలిపి 1.011 టీఎంసీల నీరు అవసరమని గుర్తించారు.
ఎస్సారెస్పీ నుంచి ఆదిలాబాద్‌కు పైపులైన్‌ను జాతీయ రహదారి మీదుగా వేయాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మహెబూబ్‌ఘాట్ మీదు గా పైపులైన్‌ను వేయడం భారంతో కూడింద ని, అదేవిధంగా నిర్మాణంలో కూడా ఖర్చు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా దూరం పెరిగినా పైపులైన్ అక్కడి నుంచే వేయాలని అనుకుంటున్నారు. కాగా.. ప్రాజెక్టు వద్ద గ్రిడ్ నుంచి మండల కేంద్రాలు, పట్టణాల వరకు మెయిన్ పైపులైన్ వేస్తుండగా, మండల కేంద్రాలు, పట్టణాల నుంచి గ్రామాలకు సెకండరి పైపులైన్ కిలో మీటర్లను ప్రాథమికంగా గుర్తించారు. సర్వే అనంతరం ఇది కొంత మారే అవకాశం ఉంటుంది.
జిల్లాలో నాలుగు కార్యాలయాలు..
రానున్న రోజుల్లో గ్రామీణ నీటి సరఫరా శాఖను వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ల కోసం నాలుగు కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎస్సారెస్పీకి సంబంధించి నిర్మల్‌లో, కడెంకు సంబంధించి కడెంలోనే, కొమురంభీమ్‌కు సంబంధించి 20 కి.మీ.ల దూరంలో ఉండే ఆసిఫాబాద్‌లో, ఎల్లంపల్లికి సంబంధించి మంచిర్యాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రిడ్‌కు ఈఈలను నియమించనున్నారు. అదేవిధంగా నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏఈల ఆవశ్యకత ఉంది. ఈ దృష్ట్యా సుమారు 50 మంది ఏఈలను నియమించే అవకాశాలు ఉన్నాయి.
నాలుగు వాటర్ గ్రిడ్‌ల అంచనా వ్యయం
Published Sun, Nov 30 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement