Water Requirements
-
ఎస్సారెస్పీ నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్!
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలను కాపాడటంతోపాటు రబీలో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన నీటి విడుదలకు ప్రణాళిక ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ మొదటి దశలో దిగువమానేరు ఎగువన ఉన్న 5 లక్షలు, దిగువన 2.30 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడేందుకు నీటిని సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారు. జలసౌధలో సాగునీటి శాఖామంత్రి హరీష్‌రావు సంబంధిత ఇంజినీర్లతో జరిపిన సమీక్షలో ఇంజినీర్ ఇన్‌చీఫ్ మురళీధర్‌రావు, ఎస్సారెస్పీ రెండోదశ చీఫ్ ఇంజినీర్ నాగేందర్రావు, వరదకాలువ, దేవాదుల ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ అనిల్‌కుమార్, శ్రీరాంసాగర్ మొదటి దశ చీఫ్ ఇంజినీర్ శంకర్, సంబంధిత ప్రాజెక్టుల ఎస్ఈ, ఈఈలు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇప్పటికే ఆన్ఆఫ్ పద్ధతితో మూడుతడులు ఇచ్చామని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 65 టీఎంసీలు, దిగువమానేరులో ఎనిమిది టీఎంసీల నీరు ఉందని తెలిపారు. మానేరు ఎగువన పంటలు కాపాడటానికి ఇంకా 18 టీఎంసీలు అవసరమవుతాయని, మిషన్ భగీరథ అవసరాలకు మినహాంచుకుని దిగువన ఉన్న 2.30 లక్షల ఎకరాలకు ఆన్ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వగలమని కరీంనగర్ ఏసీఈ శంకర్ మంత్రికి వివరించారు. శ్రీరాంసాగర్ మొదటిదశలో ఉన్న మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో ఉన్న పంటను కాపాడటానికి నీరు సరఫరా ఆన్ఆఫ్ పద్ధతిలో ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో మొత్తం 244 చెరువులు ఉన్నాయని, వాటిని నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లోకి నీరు రాలేదని, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని. ఈ చెరువుల కింద ఆయకట్టును రక్షించుకోవడానికి, తాగునీటికి లోయర్ మానేరు డ్యాం నుంచి తక్షణమే నీటిని రెండో దశ పరిధిలోని చెరువులను నింపడానికి విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయకట్టు చివరలో ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులను కూడా నింపడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇంజినీర్లు కాలువల వెంట తిరుగుతూ నీటి నిర్వహణ చేయాలని సూచించారు. రాత్రివేళల్లో కూడా కాలువల మీద తిరగాలని, కాలువలను తెగ్గొట్టే ప్రయత్నాలను నిరోధించాలని అన్నారు. కాలువల గండ్లను పూడ్చడానికి జేసీబీ, టిప్పర్లను, ఇసుకబస్తాలను రెడీగా ఉంచుకోవాలని అన్నారు. జిల్లా రెవెన్యు యంత్రాంగం ఇంజినీర్లకు సహకరించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. టెయిల్టుహెడ్ పద్ధతిన నీటి నిర్వహణ చేయాలని సూచించారు. ఈ పద్ధతి గత రబీ సీజన్లో మంచి ఫలితాలను ఇచ్చిందని, చివరి భూములకు కూడా నీరు అందించగాలిగామని గుర్తుచేశారు. అలాగే తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పాలకుర్తి, గుండాల మండలాల్లో ఉన్న చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన దరిమిలా దేవాదుల ప్రాజెక్టు ఇంజినీర్లతో ఈ అంశంపై మంత్రి సమీక్షించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్పారెస్పీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 65.81 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు ఆశించిన మేరకు నీరు చేరింది. గతేడాదిలోనూ ప్రాజెక్టుకు నీరుచేరగా చెరువులు, కుంటలు నింపడంతో పాటు రబీ ఆయకటుŠుట్క ఆన్అండ్ఆప్ పద్ధతిన విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఆరేళ్లుగా తీసుకుంటే 2009లో ఆలస్యంగానైనా నిండుకుండలా మారింది. 2010లో పూర్తిస్థా యి నీటిమట్టానికి కూడా చేరుకోలేదు. 2012 లోనూ అదే పరిస్థితి. తిరిగి 2013లో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరింది. మిగులుజలాలు గోదావరిలోకి వదిలారు. 2014లో కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్ బోసిపోయింది. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్‌లో 1,60,578, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్గొండలో 2,87,508 ఎకరాలు సాగుకు దూరమయ్యయి. దీంతో ఆయకట్టు రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఏడాది వర్షాలు కురవడం ద్వారా 84.81 టీఎంసీలకు చేరింది. ఇప్పటికే ప్రాజెక్టు కింది చెరువులు నింపడంతో పాటు ఖరీఫ్‌కు కూడా నీళ్లు వదిలారు. ప్రస్తుతం 65.81 టీఎంసీల నీరుండగా.. మిషన్ భగీరథకు పోను ఎల్ఎండీ ఎగువ, దిగువల్లో 7.30 లక్షల ఎకరాలకు నీటి సరఫరా చేసేందుకు సమీక్ష అనంతరం మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పాత నేపథ్యం పాత నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ (10 కొత్త జిల్లాలు) జిల్లాల్లోని 7.30 లక్షల ఎకరాలకు ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. -
మీ నీటి అవసరాలు చెప్పండి
తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వినియోగం లో పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తొలిసారిగా తెలంగాణ తాగునీటి అవసరాలపై స్పందించింది. తెలంగాణ నీటి అవసరాలు ఏమిటో చెప్పాలంటూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు సహా, సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్పీ కింద తాగునీటికి ఏ మేర నీటి అవసరాలు ఉంటాయో చెప్పాలని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తన లేఖలో కోరారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత, నీటిని తోడేందుకు ఉన్న అవకాశాలపై వివరాలు తమ ముందుంచాలన్నారు. నీటి అవసరాలను పేర్కొంటే అందుకు అనుగుణంగా నీటి లభ్యతను బట్టి నిర్ణయం చేస్తామని వెల్లడించారు. -
వెంకన్న కొండపై నీటికి ఢోకాలేదు
కొండ డ్యాముల్లో పుష్కలంగా నీరు ఏడాదిన్నరకు సరిపడా నిల్వ అయినా పొదుపుగానే నీటి వాడకం తిరుమల: ఈ వేసవిలో తిరుమల కొండ మీద నీటికి ఢోకాలేదు. కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టులతో పాటు గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లోనూ నీరు పుష్కలంగా ఉంది. ఏడాదిన్నర వరకు నీటి అవసరాలకు ఇబ్బందుల్లేవు. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల అవసరాలతో పాటు ఆలయం, నిత్యాన్నప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరమవుతోంది. గత ఏడాది నవంబరులో కురిసిన అతి వర్షాలకు ఇక్కడి ఐదు జలాశయాలు పొంగిపొర్లాయి. అప్పటి నుంచి నీటిని వాడగా ప్రస్తుతం ఐదు జలాశయాల్లోనూ 70 శాతం నీటి వనరులున్నాయి. మరో ఏడాదిన్నరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. అయినప్పటికీ నీటి పొదు పు చర్యలు పాటిస్తున్నామని, వృథాను అరికట్టామని చెబుతున్నారు. తిరుమల: ఈ వేసవిలో తిరుమల కొండ మీద నీటికి ఢోకాలేదు. కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టులతో పాటు గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లోనూ నీరు పుష్కలంగా ఉంది. ఏడాదిన్నర వరకు నీటి అవసరాలకు ఇబ్బందుల్లేవు. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల అవసరాలతో పాటు ఆలయం, నిత్యాన్నప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరమవుతోంది. గత ఏడాది నవంబరులో కురిసిన అతి వర్షాలకు ఇక్కడి ఐదు జలాశయాలు పొంగిపొర్లాయి. అప్పటి నుంచి నీటిని వాడగా ప్రస్తుతం ఐదు జలాశయాల్లోనూ 70 శాతం నీటి వనరులున్నాయి. మరో ఏడాదిన్నరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. అయినప్పటికీ నీటి పొదు పు చర్యలు పాటిస్తున్నామని, వృథాను అరికట్టామని చెబుతున్నారు. -
జంట నగరాలకు 4.5 టీఎంసీలు కావాలి
♦ వచ్చే 3 నెలల తాగునీటి అవసరాలపై అంచనా ♦ విడుదల చేయాలని కృష్ణా బోర్డును కోరనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు మరో దఫా నీటిని విడుదల చేయాలని సర్కారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరనుంది. వచ్చే మూడు నెలల కాలానికి 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ ఒకట్రెండు రోజుల్లో లేఖ రాయనుంది. జంట నగరాల తాగునీటి అవసరాలను పేర్కొంటూ జలమండలి ఇటీవలే నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకుంటూ మే నెలాఖరు వరకు నీటి అవసరాలను నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ లెక్కలు కట్టారు. రోజుకు 525 క్యూసెక్కుల చొప్పున మూడు నెలలకు మొత్తంగా 4.53 టీఎంసీల అవసరాలు ఉంటాయని లెక్కగట్టారు. వీటితోపాటే నల్లగొండ మున్సిపాలిటీకి మే నెల వరకు 0.302 టీఎంసీలు, పెండ్లిపాకాల తాగునీటి పథకానికి 0.024 టీఎంసీలు, పెద్దవూర పథకానికి 0.0070 టీఎంసీలు, చేపూర్ తాగునీటి పథకానికి 0.014 టీఎంసీలు అవసరమవుతుందని గుర్తించారు. ఈ లెక్కలతో త్వరలోనే బోర్డుకు నీటిపారుదల శాఖ లేఖ రాయనుంది. శ్రీశైలంలో తగ్గిన నిల్వలు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టాలు తగ్గుతున్నాయి. గత నెలలో శ్రీశైలంలో 832 అడుగుల వద్ద 52 టీఎంసీల నిల్వలు ఉండగా ప్రస్తుతం 821.6 అడుగులకు తగ్గి నిల్వ 42.02 టీఎంసీలకు పడిపోయింది. ఏపీ, తెలంగాణ తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయడంతో ఇక్కడ నిల్వలు తగ్గాయి. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీటిలో వినియోగార్హమైన నీరు 790 అడుగుల దిగువ వరకు 17 టీఎంసీలు మాత్రమే ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటిని ఇరు రాష్ట్రాలు జూన్‌లో వర్షాలు కురిసే సమయం వరకు వాడుకోవాల్సి ఉంది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 17 టీఎంసీల్లో 5 టీఎంసీలు మే నెలాఖరు వరకు నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పోతే మరో 13 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంటుంది. అందులో ఏపీకి 8 టీఎంసీల వాటా పోయినా, మిగతా 5 టీఎంసీలతో జూన్ నెలాఖరు వరకు నెట్టుకురావచ్చని తెలంగాణ భావిస్తోంది. అప్పట్లోగా విస్తారంగా వర్షాలు కురిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఒకవేళ వర్షాలు కురవకపోతే మాత్రం జూలై నుంచి తాగునీటి ఇక్కట్లు తప్పవని అధికారులు చెబుతున్నారు. -
నాలుగు కాదు..10.54 టీఎంసీలు
కృష్ణా బోర్డుకు తాజాగా విన్నవించిన తెలంగాణ ♦ 4.8 టీఎంసీలు కేవలం సాగర్ కనీస నీటి మట్టానికే సరిపోతాయని వివరణ ♦ మరో 4.5 టీఎంసీలు జంటనగరాలకు, నల్లగొండకు 1.13 టీఎంసీలు ♦ తమకూ వాటా కావాలంటున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాలకు ముందుగా అనుకున్నట్లు నాలుగు టీఎంసీలు సరిపోవని, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 10.54 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం తాజాగా విన్నవించింది. హైదరాబాద్, నల్గొండ తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నీటిని తక్షణమే విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. నల్గొండ జిల్లాలోని 14 తాగునీటి పథకాలకు 1.13 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 4.5టీఎంసీల నీరు అవసరంముందని పేర్కొన్నారు. అయితే నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 507 అడుగుల నీటి మట్టం ఉందని, జంట నగరాలకు నిరంతరంగా తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవాలంటే సాగర్‌లో 510 అడుగుల కనీస నీటి మట్టాన్ని ఉండేలా చూడాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సాగర్‌లో నీటి మట్టాన్ని 507 నుంచి 510 అడుగులకు పెంచడానికి 4.87 టీఎంసీలు అవసరమని వివరించారు. ఈ దృష్ట్యా సాగర్‌లో లోటు పూడ్చేందుకు 4.8టీఎంసీలతో పాటు హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు కోరిన మేరకు నీటిని విడుదల చేయాలని లేఖలో కోరారు. శ్రీశైలంలో ప్రస్తుతం 832.4 అడుగుల మట్టం వద్ద 52.06 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఇందులో 790 అడుగుల మట్టం వరకు 27.66 టీఎంసీల వినియోగార్హమైన నీరు ఉందని గుర్తు చేశారు. నీటి వాటా కోరుతున్న ఏపీ.. కాగా ఆంధ్రప్రదేశ్ సైతం తన రాష్ట్ర తాగునీటి అవసరాల నిమిత్తం 4 నుంచి 6 టీఎంసీల నీరు కావాలని అంటోంది. తన రాష్ట్ర అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని నేడో, రేపో ఏపీ సైతం బోర్డుకు లేఖ రాయనుందని తెలిసింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
నాలుగు వాటర్ గ్రిడ్ల అంచనా వ్యయం
రూ.4,390 కోట్లు ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమినిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం కింద జిల్లాలోని నాలుగు గ్రిడ్లకు రూ.4,390 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఎస్సారెస్పీ, కడెం, కొమురంభీమ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌ల కోసం ఈ అంచనా వేశారు. మొదట జిల్లాలో ఐదు వాటర్‌గ్రిడ్‌ల కోసం అంచనాలు రూపొందించినా గడ్డెన్న వాగును తప్పించారు. ముథోల్ నియోజకవర్గం కోసం గడ్డెన్నవాగు నుంచి తాగునీటి సరఫరా కోసం రూ.163 కోట్లతో పనులు నడుస్తుండటంతో వాటర్‌గ్రిడ్‌లో దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. కాగా.. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 26 వాటర్‌గ్రిడ్‌లు నిర్మిస్తుండగా అందులో ఆరు గ్రిడ్లను ప్రభుత్వం పైలేట్ ప్రాజెక్టులుగా తీసుకుంది. వాటిలో జిల్లాలోని కడెం కూడా ఉంది. కడెం సర్వే మొదలు.. కడెం ప్రాజెక్టు వద్ద వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి సర్వే మొదలైంది. 862 కిలో మీటర్లలో పైపులైన్ వేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రధాన పైపులైన్, గ్రామాలకు వెళ్లే సెకండరీ పైపులైన్ పైన పేర్కొన్న కిలో మీటర్లలో విస్తరించి ఉంటుంది. ప్రధానంగా సర్వేలో మొదట అంచనా వేసిన విధంగా ఎన్ని కిలో మీటర్ల మేర పైపులైన్ వేయాల్సి ఉంటుంది, పైపులైన్ కోసం ఎంత ప్రభుత్వ, ప్రైవేటు భూములు సేకరించాల్సి వస్తుంది, మార్గమధ్యలో ఎన్ని కల్వర్టులు అవసరం, ఆఫ్టికల్ ఫైబర్‌లైన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందనేది అంచనా వేస్తారు. సర్వే ఆధారంగా గ్రిడ్ డిజైన్‌కు టెండర్ పిలుస్తారు. తదుపరి గ్రిడ్ అంచనా వ్యయాన్ని రూపొందిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు వాటర్‌గ్రిడ్‌లకు సంబంధించి ప్రాథమికంగా ఎన్ని కిలో మీటర్లలో పైపులైన్, అంచనా వ్యయాన్ని రూపొందించారు. సర్వే తర్వాత ఇందులో స్వల్పంగా మార్పులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వెనువెంటనే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు వాటర్గ్రిడ్లను పైలేట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రస్తుతం సర్వే పనులు ప్రారంభించింది. జిల్లాలో కడెం సర్వే పనులు మొదలయ్యాయి. డిసెంబర్లో సర్వే పూర్తిచేసి జనవరిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చిలో పనులు ప్రారంభించాలని తలుస్తున్నారు. పైలేట్ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు కాగానే జనవరిలో మిగితా గ్రిడ్ల సర్వే కోసం టెండర్లు నిర్వహించి ఫిబ్రవరిలో సర్వే పూర్తి చేసి, మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి సర్వే పనులు వెనువెంటనే ఉంటాయని చెబుతున్నారు. వాటర్‌గ్రిడ్ స్వరూపం.. తాగునీటి, ఇతర అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మనిషికి రోజుకు వంద లీటర్లు, అర్బన్‌లో 135 లీటర్ల నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రెండు నెలల కిందట ఏయే ప్రాజెక్టుల నుంచి నియోజకవర్గాలు, మండలాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుందనేది ప్రాథమికంగా అంచనా వేశారు. 2030 సంవత్సరం జనాభాకు అనుగుణంగా తాగునీటి అసవరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు అవసరమవుతాయో కూడా నిర్ధారించారు. ఎస్సారెస్పీ నుంచి నిర్మల్‌లోని ఐదు మండలాలు, బోథ్‌లో ఏడు, ఆదిలాబాద్‌లోని మూడు మండలాలకు కలిపి 2.8 టీఎంసీలు, ఎల్లంపల్లి కింద మంచిర్యాలలోని మూడు, చెన్నూర్‌లోని నాలుగు, బెల్లంపల్లిలోని ఆరు మండలాలు కలిపి 1.673 టీఎంసీలు, కొమురంభీమ్ కింద సిర్పూర్(టి) నియోజకవర్గంలో ని ఐదు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు కలిపి 1.011 టీఎంసీల నీరు అవసరమని గుర్తించారు. ఎస్సారెస్పీ నుంచి ఆదిలాబాద్‌కు పైపులైన్‌ను జాతీయ రహదారి మీదుగా వేయాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మహెబూబ్ఘాట్ మీదు గా పైపులైన్‌ను వేయడం భారంతో కూడింద ని, అదేవిధంగా నిర్మాణంలో కూడా ఖర్చు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా దూరం పెరిగినా పైపులైన్ అక్కడి నుంచే వేయాలని అనుకుంటున్నారు. కాగా.. ప్రాజెక్టు వద్ద గ్రిడ్ నుంచి మండల కేంద్రాలు, పట్టణాల వరకు మెయిన్ పైపులైన్ వేస్తుండగా, మండల కేంద్రాలు, పట్టణాల నుంచి గ్రామాలకు సెకండరి పైపులైన్ కిలో మీటర్లను ప్రాథమికంగా గుర్తించారు. సర్వే అనంతరం ఇది కొంత మారే అవకాశం ఉంటుంది. జిల్లాలో నాలుగు కార్యాలయాలు.. రానున్న రోజుల్లో గ్రామీణ నీటి సరఫరా శాఖను వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ల కోసం నాలుగు కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎస్సారెస్పీకి సంబంధించి నిర్మల్‌లో, కడెంకు సంబంధించి కడెంలోనే, కొమురంభీమ్‌కు సంబంధించి 20 కి.మీ.ల దూరంలో ఉండే ఆసిఫాబాద్‌లో, ఎల్లంపల్లికి సంబంధించి మంచిర్యాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రిడ్‌కు ఈఈలను నియమించనున్నారు. అదేవిధంగా నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏఈల ఆవశ్యకత ఉంది. ఈ దృష్ట్యా సుమారు 50 మంది ఏఈలను నియమించే అవకాశాలు ఉన్నాయి.