ఎస్సారెస్పీ నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌! | Sriram Sagar Project Water Release Schedule Karimnagar | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌!

Published Mon, Oct 1 2018 8:50 AM | Last Updated on Mon, Oct 1 2018 8:50 AM

Sriram Sagar Project Water Release Schedule Karimnagar - Sakshi

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలను కాపాడటంతోపాటు రబీలో ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిన నీటి విడుదలకు ప్రణాళిక ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ మొదటి దశలో దిగువమానేరు ఎగువన ఉన్న 5 లక్షలు, దిగువన 2.30 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడేందుకు నీటిని సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారు. జలసౌధలో సాగునీటి శాఖామంత్రి హరీష్‌రావు సంబంధిత ఇంజినీర్లతో జరిపిన సమీక్షలో ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ మురళీధర్‌రావు, ఎస్సారెస్పీ రెండోదశ చీఫ్‌ ఇంజినీర్‌ నాగేందర్‌రావు, వరదకాలువ, దేవాదుల ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌కుమార్, శ్రీరాంసాగర్‌ మొదటి దశ చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్, సంబంధిత ప్రాజెక్టుల ఎస్‌ఈ, ఈఈలు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇప్పటికే ఆన్‌ఆఫ్‌ పద్ధతితో మూడుతడులు ఇచ్చామని చీఫ్‌ ఇంజినీర్‌ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 65 టీఎంసీలు, దిగువమానేరులో ఎనిమిది టీఎంసీల నీరు ఉందని తెలిపారు. మానేరు ఎగువన పంటలు కాపాడటానికి ఇంకా 18 టీఎంసీలు అవసరమవుతాయని, మిషన్‌ భగీరథ అవసరాలకు మినహాంచుకుని దిగువన ఉన్న 2.30 లక్షల ఎకరాలకు ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో నీరు ఇవ్వగలమని కరీంనగర్‌ ఏసీఈ శంకర్‌ మంత్రికి వివరించారు. శ్రీరాంసాగర్‌ మొదటిదశలో ఉన్న మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో ఉన్న పంటను కాపాడటానికి నీరు సరఫరా ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో మొత్తం 244 చెరువులు ఉన్నాయని, వాటిని నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లోకి నీరు రాలేదని, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని. ఈ చెరువుల కింద ఆయకట్టును రక్షించుకోవడానికి, తాగునీటికి లోయర్‌ మానేరు డ్యాం నుంచి తక్షణమే నీటిని రెండో దశ పరిధిలోని చెరువులను నింపడానికి విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయకట్టు చివరలో ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులను కూడా నింపడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇంజినీర్లు కాలువల వెంట తిరుగుతూ నీటి నిర్వహణ చేయాలని సూచించారు.

రాత్రివేళల్లో కూడా కాలువల మీద తిరగాలని, కాలువలను తెగ్గొట్టే ప్రయత్నాలను నిరోధించాలని అన్నారు. కాలువల గండ్లను పూడ్చడానికి జేసీబీ, టిప్పర్లను, ఇసుకబస్తాలను రెడీగా ఉంచుకోవాలని అన్నారు.  జిల్లా రెవెన్యు యంత్రాంగం ఇంజినీర్లకు సహకరించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. టెయిల్‌టుహెడ్‌ పద్ధతిన నీటి నిర్వహణ చేయాలని సూచించారు. ఈ పద్ధతి గత రబీ సీజన్‌లో మంచి ఫలితాలను ఇచ్చిందని, చివరి భూములకు కూడా నీరు అందించగాలిగామని గుర్తుచేశారు. అలాగే తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పాలకుర్తి, గుండాల మండలాల్లో ఉన్న చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన దరిమిలా దేవాదుల ప్రాజెక్టు ఇంజినీర్లతో ఈ అంశంపై మంత్రి సమీక్షించారు.

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్పారెస్పీ
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 65.81 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు ఆశించిన మేరకు నీరు చేరింది. గతేడాదిలోనూ ప్రాజెక్టుకు నీరుచేరగా చెరువులు, కుంటలు నింపడంతో పాటు రబీ ఆయకటుŠుట్క ఆన్‌అండ్‌ఆప్‌ పద్ధతిన విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఆరేళ్లుగా తీసుకుంటే 2009లో ఆలస్యంగానైనా నిండుకుండలా మారింది. 2010లో పూర్తిస్థా యి నీటిమట్టానికి కూడా చేరుకోలేదు. 2012 లోనూ అదే పరిస్థితి. తిరిగి 2013లో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరింది. మిగులుజలాలు గోదావరిలోకి వదిలారు. 2014లో కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్‌ బోసిపోయింది. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

నిజామాబాద్‌లో 1,60,578, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్‌లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్గొండలో 2,87,508 ఎకరాలు సాగుకు దూరమయ్యయి. దీంతో ఆయకట్టు రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఏడాది వర్షాలు కురవడం ద్వారా 84.81 టీఎంసీలకు చేరింది. ఇప్పటికే ప్రాజెక్టు కింది చెరువులు నింపడంతో పాటు ఖరీఫ్‌కు కూడా నీళ్లు వదిలారు. ప్రస్తుతం 65.81 టీఎంసీల నీరుండగా.. మిషన్‌ భగీరథకు పోను ఎల్‌ఎండీ ఎగువ, దిగువల్లో 7.30 లక్షల ఎకరాలకు నీటి సరఫరా చేసేందుకు సమీక్ష అనంతరం మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పాత నేపథ్యం పాత నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ (10 కొత్త జిల్లాలు) జిల్లాల్లోని 7.30 లక్షల ఎకరాలకు ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఎస్సారెస్పీ నీటి విడుదలపై ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీష్‌రావు, పాల్గొన్న ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఏసీఈ శంకర్‌ తదితరులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement