కృష్ణా బోర్డుకు తాజాగా విన్నవించిన తెలంగాణ
♦ 4.8 టీఎంసీలు కేవలం సాగర్ కనీస నీటి మట్టానికే సరిపోతాయని వివరణ
♦ మరో 4.5 టీఎంసీలు జంటనగరాలకు, నల్లగొండకు 1.13 టీఎంసీలు
♦ తమకూ వాటా కావాలంటున్న ఏపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాలకు ముందుగా అనుకున్నట్లు నాలుగు టీఎంసీలు సరిపోవని, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 10.54 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం తాజాగా విన్నవించింది. హైదరాబాద్, నల్గొండ తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నీటిని తక్షణమే విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. నల్గొండ జిల్లాలోని 14 తాగునీటి పథకాలకు 1.13 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 4.5టీఎంసీల నీరు అవసరంముందని పేర్కొన్నారు.
అయితే నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 507 అడుగుల నీటి మట్టం ఉందని, జంట నగరాలకు నిరంతరంగా తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవాలంటే సాగర్‌లో 510 అడుగుల కనీస నీటి మట్టాన్ని ఉండేలా చూడాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సాగర్‌లో నీటి మట్టాన్ని 507 నుంచి 510 అడుగులకు పెంచడానికి 4.87 టీఎంసీలు అవసరమని వివరించారు. ఈ దృష్ట్యా సాగర్‌లో లోటు పూడ్చేందుకు 4.8టీఎంసీలతో పాటు హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు కోరిన మేరకు నీటిని విడుదల చేయాలని లేఖలో కోరారు. శ్రీశైలంలో ప్రస్తుతం 832.4 అడుగుల మట్టం వద్ద 52.06 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఇందులో 790 అడుగుల మట్టం వరకు 27.66 టీఎంసీల వినియోగార్హమైన నీరు ఉందని గుర్తు చేశారు.
నీటి వాటా కోరుతున్న ఏపీ..
కాగా ఆంధ్రప్రదేశ్ సైతం తన రాష్ట్ర తాగునీటి అవసరాల నిమిత్తం 4 నుంచి 6 టీఎంసీల నీరు కావాలని అంటోంది. తన రాష్ట్ర అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని నేడో, రేపో ఏపీ సైతం బోర్డుకు లేఖ రాయనుందని తెలిసింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
నాలుగు కాదు..10.54 టీఎంసీలు
Published Sat, Jan 30 2016 12:20 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement