జంట నగరాలకు 4.5 టీఎంసీలు కావాలి
♦ వచ్చే 3 నెలల తాగునీటి అవసరాలపై అంచనా
♦ విడుదల చేయాలని కృష్ణా బోర్డును కోరనున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు మరో దఫా నీటిని విడుదల చేయాలని సర్కారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరనుంది. వచ్చే మూడు నెలల కాలానికి 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ ఒకట్రెండు రోజుల్లో లేఖ రాయనుంది. జంట నగరాల తాగునీటి అవసరాలను పేర్కొంటూ జలమండలి ఇటీవలే నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకుంటూ మే నెలాఖరు వరకు నీటి అవసరాలను నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ లెక్కలు కట్టారు. రోజుకు 525 క్యూసెక్కుల చొప్పున మూడు నెలలకు మొత్తంగా 4.53 టీఎంసీల అవసరాలు ఉంటాయని లెక్కగట్టారు. వీటితోపాటే నల్లగొండ మున్సిపాలిటీకి మే నెల వరకు 0.302 టీఎంసీలు, పెండ్లిపాకాల తాగునీటి పథకానికి 0.024 టీఎంసీలు, పెద్దవూర పథకానికి 0.0070 టీఎంసీలు, చేపూర్ తాగునీటి పథకానికి 0.014 టీఎంసీలు అవసరమవుతుందని గుర్తించారు. ఈ లెక్కలతో త్వరలోనే బోర్డుకు నీటిపారుదల శాఖ లేఖ రాయనుంది.
శ్రీశైలంలో తగ్గిన నిల్వలు
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టాలు తగ్గుతున్నాయి. గత నెలలో శ్రీశైలంలో 832 అడుగుల వద్ద 52 టీఎంసీల నిల్వలు ఉండగా ప్రస్తుతం 821.6 అడుగులకు తగ్గి నిల్వ 42.02 టీఎంసీలకు పడిపోయింది. ఏపీ, తెలంగాణ తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయడంతో ఇక్కడ నిల్వలు తగ్గాయి. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీటిలో వినియోగార్హమైన నీరు 790 అడుగుల దిగువ వరకు 17 టీఎంసీలు మాత్రమే ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటిని ఇరు రాష్ట్రాలు జూన్‌లో వర్షాలు కురిసే సమయం వరకు వాడుకోవాల్సి ఉంది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 17 టీఎంసీల్లో 5 టీఎంసీలు మే నెలాఖరు వరకు నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పోతే మరో 13 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంటుంది. అందులో ఏపీకి 8 టీఎంసీల వాటా పోయినా, మిగతా 5 టీఎంసీలతో జూన్ నెలాఖరు వరకు నెట్టుకురావచ్చని తెలంగాణ భావిస్తోంది. అప్పట్లోగా విస్తారంగా వర్షాలు కురిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఒకవేళ వర్షాలు కురవకపోతే మాత్రం జూలై నుంచి తాగునీటి ఇక్కట్లు తప్పవని అధికారులు చెబుతున్నారు.