చిన్న నీటి పారుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిబుల్ ఆర్(ఆధునీకరణ, పునరుద్ధరణ, మరమ్మతులు) పథకం కింద వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 133 చెరువులకు గాను రూ.109.70 కోట్లు మంజూరయ్యాయి.
వరంగల్ : చిన్న నీటి పారుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిబుల్ ఆర్(ఆధునీకరణ, పునరుద్ధరణ, మరమ్మతులు) పథకం కింద వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 133 చెరువులకు గాను రూ.109.70 కోట్లు మంజూరయ్యాయి. వీటి కింద ప్రస్తుతం 6,692 హెక్టార్ల ఆయకట్టు ఉంది. తాజాగా కేటాయించిన నిధులతో ఈ ఆయకట్టును 14,118 హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాకు సంబంధించి 46 చెరువు లకు రూ.41.18 కోట్లు మంజూరయ్యాయి. వీటి ప్రస్తుత ఆయకట్టు 1,091 కాగా, నిర్దేశిత ఆయకట్టు నిధుల వరద 5,211గా ఉంది. చెరువుల ఆయకట్టును పెంచడం ట్రిపుల్ ఆర్ పతకం ప్రధాన ఉద్దేశం.
గిరిజన ప్రాంతాల్లో ఉన్న చెరువులకు ఈ నిధులు కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తారు. చెరువులకు సంబంధించి నిర్మాణ సమయంలో నిర్ధేశించిన ఆయకట్టుకు ప్రస్తుతం సాగు నీరు అందించలేక పోతున్నాయి. స్థిరీకరించిన ఆయకట్టుకు 50 శాతం కంటే తక్కువ నీరు అందించే చెరువులను ఈ పథకంలో తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకంలో చెరువు కట్టలను పట్టిష్టం చేయడం, మత్తడిని పునర్మించడం, మరమ్మతులతోపాటు పొలాలకు నీరు అందించేందుకు పంట కాల్వలు, చెరువుకు వరద వచ్చే ఫీడర్ చానళ్లను నిర్మిస్తారు. చెరువును పూర్తి స్థాయిలో ఆధునీకరించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ఆయకట్టు పెరుగుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో..
నీటి వినియోగదారుల సంఘాల పర్యవేక్షణలో ఉన్న చెరువులను ట్రిపుల్ ఆర్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేస్తారు. 100 ఎకరాలకు పైబడి సాగునీరు అందిస్తున్న చెరువులకు ఈ పథకం వర్తిస్తుంది. ఆయకట్టు ఎక్కువగా ఉండే చెరువులను మరమ్మతులు, ఆధునీకరణ, స్థిరీకరణకు ఒకేసారి భారీగా నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఒకేసారి పెద్ద మొత్తంలో చెరువులకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. చెరువులకు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కారుతో కలిసి ట్రిపుల్ ఆర్ పథకం చేపట్టింది. ఈ పథకం కింద 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి.
ఈ పథకం కింద చేపట్టే చెరువులను జిల్లా స్థాయి కమిటీలు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిసాదిస్తాయి. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయి కమిటీ చెరువులను ఎంపిక చేస్తుంది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు), కేంద్ర జలవనరుల శాఖ అధికారులు హాజరవుతారు. గతంలో చేపట్టిన చెరువు పనుల ప్రగతి, చేసిన ఖర్చు అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్తగా చేపట్టే చెరువులకు నిధులు మంజూరు చేసేందుకు అంగీకారం తెలుపుతారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయలో చెరువుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతున్నందున కొన్ని జిల్లాల నుంచి త్రిబుల్ ఆర్‌లో ప్రతిపాదనలు విషయంలో ఆలస్యం జరిగింది. త్రిబుల్ ఆర్ పథకంపై ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో నాలుగు జిల్లాల్లోని చెరువులకు నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకారం తెలిపారు. ఈ చెరువులను మిషన్ కాకతీయలో చేపడుతున్నప్పటికి నిధులు త్రిబుల్ ఆర్ లో కేటాయిస్తారు.