ముకరంపుర : అధికారం చేపట్టినప్పటినుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను వేలెత్తి చూపుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.
ముకరంపుర :
అధికారం చేపట్టినప్పటినుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను వేలెత్తి చూపుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేషన్‌కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులను అందించాలని నిర్ణయించింది. తొలివిడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 10 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరణకు నడుం బిగించింది. పట్టణాలు, నగరాల్లో ఈ కార్డుల జారీపై ప్రణాళిక ఖరారు కాలేదు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆహార భద్రత కార్డుల జారీ ప్రణాళికపై చర్చించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఐకేపీ ఏపీఏంలతో గురువారం ఉదయం 9కి సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి హాజరవుతారని తెలిపారు. పూర్తిస్థాయిలో ప్రణాళిక, విధివిధానాలపై నేడు మండలస్థాయి అధికారులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఇప్పటికే లక్ష దరఖాస్తులు..
జిల్లాలో కుటుంబాల లెక్కు మించి రేషన్‌కార్డులుండటం, పీడీఎఫ్ బియ్యం పక్కదారి పట్టడం వంటి వాటిని సర్కారు సీరియస్‌గా పరిగణించింది. బోగస్ రేషన్‌కార్డుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 10,01,047 రేషన్ కార్డులున్నాయి. రేషన్ అనుసంధానం, బోగస్ ఏరివేతలో భాగంగా 85వేల కార్డులను తొలగించారు. ఫలితంగా 20వేల క్వింటాళ్ల బియ్యం ఆదా అయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 9.70 జిల్లాలో లక్షల కుటుంబాలు ఉండేవి.
ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబాల సంఖ్య 12,66,320కు చేరింది. అంటే కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం ప్రజావాణిలో అర్జీల రూపంలో లక్షదాకా దరఖాస్తులు వచ్చాయి. తాజాగా దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఐదెకరాలకు పైగా భూమి ఉన్నవారు, ప్ర భుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలను మినహా యించి మిగిలిన వారికి ఆహార భద్రత కా ర్డులు జారీ చేస్తారు. ఈ కార్డు కింద ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం ఇవ్వాలని సూత్రప్రాయంగా సర్కారు నిర్ణయించింది. రేషన్ కార్డు స్థానంలో వస్తున్న ఆహార భద్రత కార్డు కేవలం ప్రజాపంపిణీ సరుకుల కోసం మాత్రమేనని, దేనికీ లింకు ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సమగ్ర కుటుంబ సర్వే, గతంలో జారీ చేసిన తెల్లరేషన్ కార్డు లిస్టు, ఓటరు లిస్టు, ఐకేపీ రూపొందించిన నిరుపేదల జాబితా ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తామని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు.
గ్రామాలలో ఈ నెల 10 నుంచి 15 వరకు పేదలకు ఆహార భద్రత కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ నెల 16 నుంచి 25 వరకు దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన, 26 నుంచి 29 వరకు అర్హుల జాబితాను రూపొందించి 30న ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.
అర్హులైన పేదలందరూ ఆహార భద్రత కార్డులకు తెల్లకాగితం మీద తమ వివరాలను రాసి సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ కోరారు. పట్టణాలలో కార్డుల జారీకి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. మొదటి విడత గ్రామీణ ప్రాంతాల వారికి కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. అతనికి సహాయకుడిగా వీఆర్‌వో లేద గ్రామ కార్యదర్శిని నియమిస్తామని తెలిపారు. ఆహార భద్రత కార్డుల జారీలో మండల స్థాయిలో తహసీల్దార్ బాధ్యత వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో టి.వీరబ్రహ్మయ్య, డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్, ఏవో రాజాగౌడ్, డీఎస్‌వో చంద్రప్రకాశ్ పాల్గొన్నారు.