
హైదరాబాద్‌లో ప్రపంచ ఔషధ వాణిజ్య కేంద్రం
- కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటుకు నిర్ణయం
- జీవశాస్త్రాల రంగంపై ప్రత్యేక విధానం ప్రకటించిన ప్రభుత్వం
- విధాన ప్రకటనను ఆవిష్కరించిన పరిశ్రమల మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రపంచ ఔషధ వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఔషధ ఎగుమతుల సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్ హైటెక్స్‌లో సోమవారం ‘బయో ఆసియా-2015 జీవశాస్త్ర రంగంలో నూతన శకం’ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ జీవశాస్త్రాల విధాన ప్రకటనను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్య్రూ మెక్‌ల్లిస్టర్, థాయ్‌లాండ్ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి సోమ్‌ఛాయ్, అజిత్‌శెట్టి, డాక్టర్ పీవీ అప్పాజీ, డాక్టర్ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జూపల్లి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పారిశ్రామికవేత్తలంతా సహకరించాలని కోరారు.
హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్నాయని, ఔత్సాహికలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రపంచ ఔషధ ఉత్పత్తుల్లో 33 శాతం హైదరాబాద్ నుంచే అవుతున్నాయన్నారు. బయోటెక్ కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ జీవశాస్త్రాల రంగంపై ప్రభుత్వం ప్రకటించిన విధాన పత్రంలోని ముఖ్యాంశాలను వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తాము ఈ విధాన ప్రకటన చేస్తున్నామన్నారు. కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం నిర్ణీత సమయంలో అనుమతులు పొందే విధానాన్ని ఇప్పటికే ప్రకటించిన అంశాన్ని గుర్తుచేశారు. పరిశ్రమలశాఖ కమిషనర్ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలశాఖ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జీవశాస్త్రాల విధాన ప్రకటనలోని ముఖ్యాంశాలు...
డిసెంబర్‌లో విడుదల చేసిన నూతన పారిశ్రామిక విధానంలోని 14 ప్రధాన రంగాల్లో జీవశాస్త్ర రంగం ఒకటి.
జీవశాస్త్ర రంగంలో బయో టెక్నాలజీ, బల్క్‌డ్రగ్స్, ఫార్ములేషన్స్, వ్యాక్సిన్స్ ఉంటాయి. వచ్చే రోజుల్లో జీవశాస్త్ర రంగాన్ని అభివృద్ధి పరచడమే దీని లక్ష్యం. ఇతర జీవశాస్త్ర రంగాలతో దీటుగా దీన్ని వృద్ధి చేయడం.
2020 నాటికి కొత్తగా రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు సాధించడం ఈ విధాన ప్రకటనలోని ముఖ్య ఉద్దేశం. రూ. 50 వేల కోట్ల ఎగుమతులు... 50 వేల మందికి ప్రతక్ష్య ఉపాధి కల్పించడం.
జీవశాస్త్రాల రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం.
నగర శివారులో సమగ్ర ఔషధ నగరం అభివృద్ధి. అందులో ఔషధ విశ్వవిద్యాలయ స్థాపన.
పీపీపీ పద్ధతిలో జీవశాస్త్రాల విజ్ఞాన కేంద్రం ఏర్పాటు. ఇందులో వృత్తి నిపుణులతో విద్యార్థులకు శిక్షణ.
ఈ రంగంలో మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ కోసం జాతీయ ఔషధ విద్యా పరిశోధన సంస్థ (నైపర్)తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం.
మెదక్ జిల్లా ములుగులోని జీనోమ్ వ్యాలీని విస్తరించి 200 ఎకరాల్లో నాలుగో దశ ఏర్పాటు. జిల్లాలోని సుల్తాన్‌పూర్ వద్ద వైద్య పరికరాల ఉత్పత్తి పార్కు ఏర్పాటు.
టీకాల నాణ్యత పరీక్ష కేంద్రం ఏర్పాటు. బయో భద్రత, పశువుల మందుల తయారీ కేంద్రాల స్థాపన.
ప్రైవేటు పార్కులకు ప్రోత్సాహం. టీఎస్‌ఐఐసీ మాదిరే మౌలిక వసతులు, రాయితీలు కల్పన.
పరిశోధన, ఆవిష్కరణల మండలి స్థాపన.