
సింగరేణి పింఛన్ ఉంటే.. సర్కార్ పింఛన్ కట్
మందమర్రి రూరల్(ఆదిలాబాద్) : ఒక వ్యక్తికి రెండు పింఛన్లు వర్తించరాదని ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి పింఛన్ రూ.1000కి మించి తీసుకునే మాజీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ వర్తించదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగా ణ రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.1000లకు పెం చింది. ఇందులో భాగంగా పట్టణంలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులు పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇక్కడ ఎక్కువగా సింగరేణి కార్మిక కుంటుబాలే ఉన్నాయి.
అందులో రిటైర్ అయినవారు, 65 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటికే సింగరేణిలో పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోగా వారందరికీ పింఛన్లు మంజూరయ్యా యి. ప్రస్తుతం మందమర్రి మునిసిపాలిటీ పరిధిలో 5,900 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారు. సింగరేణిలో రూ.1000 లోపు పింఛన్ తీసుకుంటున్న వారికి మాత్రమే ప్రభుత్వం పింఛన్ వర్తిస్తుందని కమిషనర్ లింబాద్రి తెలిపారు.
దీంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. సింగరేణిలో రూ.3000 పింఛన్ పొందుతున్న వారికి కూడా ప్రభుత్వ ఇచ్చే రూ.1000 పింఛన్ వర్తిస్తుందని సర్కారు ముందుగా ప్రకటించిదని, దాని ప్రకారంగా 6 నెలలుగా పింఛన్ తీసుకుంటున్నామని పలువురు తెలిపారు. 40 సంవత్సరాలు సింగరేణిలో పని చేసి అనేక వ్యాధులతో బాధపడుతున్న తాము కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నామని, కంపెనీ పింఛన్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలని మాజీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.