ఉభయ రాష్ట్రాల తీరును తప్పుబట్టిన హైకోర్టు
► ఏకీకృత సర్వీసుపై తీర్పును అమలు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారంలో ఏకీకృత సర్వీసు నిబంధనలను రద్దు చేస్తూ కేశవుల కేసులో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో తెలుగు రాష్ట్రాల తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. కేశవుల కేసులో హైకోర్టు తీర్పును అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినందున అధికారుల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వడం లేదని పేర్కొంది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారంలో ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం 1998లో జారీ చేసిన జీవోలు 505, 538లను సవాలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, జిల్లా విద్యాధికారులు మొదటి పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో కేశవులు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
విచారణ జరిపిన హైకోర్టు జీవో 538ని పూర్తిగా, 505 జీవోను పాక్షికంగా కొట్టేస్తూ 2003లో తీర్పునిచ్చింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులతో ప్రభుత్వ టీచర్లను ఏకీకృత చేయడం రాజ్యాంగ విరుద్ధమే కాక, రాష్ట్రపతి ఉత్తర్వులకు సైతం విరుద్ధమని తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా పంచాయతీరాజ్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చుకుంటూ వెళ్లింది. 2015లో సుప్రీంకోర్టు కేశవుల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేశవుల కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం పంచాయతీరాజ్ టీచర్ల పదోన్నతులకు గత ఏడాది జీవో 10 జారీ చేసింది. దీనిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు మరో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.