
వీడిన ‘విగ్రహ’ ముడి
ప్రధాన అర్చకుడి బీరువాలో బయటపడిన విగ్రహం
► అధికారుల సమక్షంలో తనిఖీ
► తీసుకెళ్లింది ఉత్సవ విగ్రహం కాదు
నిర్మల్ రూరల్: బాసర సరస్వతమ్మ విగ్రహ లొల్లి ఓ కొలిక్కి వచ్చింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరుదాటించారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ప్రధాన అర్చకుడి అధీనంలో ఉన్నది అమ్మవారి ఉత్స వమూర్తి కాదని, భక్తులు సమర్పించిన చిన్న విగ్రహమేనని అధికారులే తేల్చారు. ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి, రెవెన్యూ, పోలీసుల సమక్షంలో సోమవారం బీరువాలను తెరిచా రు. ఇందులో ప్రధాన అర్చకుడి బీరువాలో భక్తులు కానుకగా ఇచ్చిన కిలోన్నర బరు వున్న అమ్మవారి పంచలోహ విగ్రహం బయ టపడింది.
ఆలయ ప్రధానార్చకుడు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్ శర్మలతో పాటు పరిచారకుడు విశ్వజిత్‌లు గత నెల 28న నల్లగొండ జిల్లా దేవరకొండ లోని రెండు పాఠశాలల్లో అక్షరాభ్యాసాలను చేయించారు. ఈ పూజలకు బాసర క్షేత్రం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారని ప్రచారం జరిగింది. దీంతో ఆలయ అధికా రులు విచారణ చేపట్టారు. ప్రధానార్చకుడు అందుబాటులో లేకపోవడం, విగ్రహం కూడా కనిపించకపోవడంతో ఆలయ అధికా రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరకొండకు వెళ్లిన అర్చకులే విగ్రహాన్ని తీసుకెళ్లారని అనుమానం ఉందన్నారు. ఆలయ స్టోర్‌రూంలోని ప్రధాన అర్చకుడి బీరువాలను సీజ్ చేశారు. ఈ వివాదంలో దేవాదాయశాఖ ప్రధాన అర్చకుడు, సప్తశతి పారాయణధారుడికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.
విగ్రహాల ‘లెక్క’లేదా..
ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి.. భక్తులు సమర్పించిన విగ్రహాలెన్ని.. అన్న లెక్కలు అధికారుల వద్దే స్పష్టంగా లేనట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకుడి బీరువాలో బయటపడిన విగ్రహం రికార్డుల్లో ఉందా.. అన్న దానిపైనా అధికా రులు స్పష్టత ఇవ్వలేదు. సదరు విగ్రహం గురించి ప్రశ్నిస్తే రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందని ఈవో పేర్కొనడం గమనార్హం. ఆలయంలో ఎన్ని ఉత్సవ మూర్తులు ఉన్నాయి.. ఎన్ని భక్తులు సమర్పించిన విగ్రహాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా, ఈ విగ్రహం తరలింపు విషయంలో విచారణ కొనసాగుతుందని ఆలయ ఈవో చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. కాగా, తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగం గానే కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి చెప్పారు. తాను ఎలాంటి విగ్రహాన్ని దేవర కొండకు తీసుకెళ్లలేదని వివరించారు.
బీరువా తనిఖీల్లో..
కేసు విచారణలో భాగంగా దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో సోమవారం ఆలయ ఈవో, బాసర తహసీల్దార్ వెంకటరమణ, ముధోల్ సీఐ రఘుపతి, బాసర ఏఎస్‌ఐ నర్స య్య తనిఖీలు చేపట్టారు. సీజ్ చేసిన ప్రధాన అర్చకుడి బీరువాలో సరస్వతీ మాత పంచలోహ విగ్రహం బయట పడింది. అది అమ్మవారి ఉత్సవ విగ్రహం కాదని, భక్తులు సమర్పించిన విగ్రహమేనని తేలింది.