పాల్వంచ, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణంలో వైఎస్సార్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తూ బంగారు తెలంగాణకు పాటుపడుతుందన్నారు. పాత పాల్వంచలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మా ట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుందన్నారు. అయితే.. ప్రజల పక్షానే ఉంటూ సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు.
వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కొవ్వూరు రైల్వేలైన్ ఏర్పాటుకు శక్తివంచన లేకుండా పాటుపడతానన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొద్ది నెలల్లోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగూడెంలోనే స్టీల్‌ప్లాంట్, నవభారత్ వద్ద సోలార్ ప్లాంట్ నిర్మాణాలు, పాల్వంచలో కేటీపీఎస్ ఏడోదశ శంకుస్థాపనకు కృషి చేస్తానన్నారు. సోలార్‌ప్లాంట్ నిర్మాణం కోసం గతం నుంచే తాము ముమ్మర ప్రయత్నాలను మొదలుపెట్టామని చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు తదితర సౌకర్యాలను మెరుగుపరుస్తానన్నారు.
జగన్ నాయకత్వంలో సమస్యలపై పోరు
తెలంగాణలో ఒక ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే సీట్లు ఉన్నా జగనన్న నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. తెలంగాణలో ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీ, బీజేపీ, ఎంఐఎంలకు ఒక్కొక్కటి వచ్చాయని ఆ బలంతోనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా పయనిస్తామని పొంగలేటి చెప్పారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయత్వం లో వైఎస్సార్‌సీపీ సీమాంధ్ర ఎంపీలు అక్కడి సమస్యలతోపాటు తెలంగాణ సమస్యలను పరిష్కరించుకునేందుకుకూడా కృషి చేస్తారన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి మోడీని ఇటీవల కోరామని చెప్పారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మట్టా దయానంద్, నాయకులు వనమా రాఘవేందర్‌రావు, మహిపతి రామలింగం, యర్రంశెట్టి ముత్తయ్య, కొత్వాల శ్రీనివాసరావు, భీమా శ్రీ ధర్, ముత్యాల వీరభద్రం, బండి లక్ష్మణ్, రజాక్, అన్వర్ పాషా, సర్పంచ్‌లు కొర్రా రాములు, తేజావత్ సుజాత, సత్యావతి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో వైఎస్సార్‌సీపీ కీలకపాత్ర
Published Sun, May 25 2014 2:42 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement