
ప్రభావం లేని రవాణా సమ్మె
- రోజుకంటే అదనంగా తిరిగిన ఆర్టీసీ బస్సులు
- ఉదయం వరకే పరిమితమైన ఆటోల బంద్
- సాయంత్రం తరువాత లారీల లోడింగ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రోడ్డు భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మె తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేదు. నేషనల్ మజ్దూర్ యూనియన్ మినహా మిగతా అన్ని కార్మిక సంఘాలు మద్దతు ప్రటించినప్పటికీ ఒకటి రెండుచోట్ల మినహా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల రద్దీ తీవ్రంగా ఉండ డంతో మామూలు రోజులతో పోలిస్తే గురువారం అదనంగా బస్సులు నడపడం విశేషం. దాదాపు వేయికిపైగా బస్సులు అదనపు ట్రిప్పులేశాయి. ఇక అన్ని సంఘాలు సంఘీభావం ప్రకటించినప్పటికీ ఆటోల సమ్మె మధ్యాహ్నం వరకే పరిమితమైంది. హైదరాబాద్‌లో ఓ యూనియన్ నేతలు మాత్రం కొన్నిచోట్ల ఆటోలను అడ్డుకున్నారు.
మార్కెట్లపై ప్రభావం...
సమ్మె కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 60 శాతం లారీలు నిలిచిపోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మార్కెట్లలో పగటివేళ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. సాయంత్రం 6 గంటల తరువాత లారీల లోడింగ్ ప్రారంభించారు. శుక్రవారం మేడే ఉండడంతో దగ్గరి ప్రాంతాలకు లోడింగ్ జరగలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు మాత్రం లోడింగ్‌తో బయలుదేరాయి. ఆర్టీసీ బస్టాండ్లలో భోజన విరామ సమయంలో కార్మికులు నిరసనలు నిర్వహించారు.
రాజధానిలో అదనంగా 350 బస్సులు
హైదరాబాద్‌లో ఆటోయూనియన్లు, రవాణా రంగానికి చెందిన కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టాయి. అన్ని రూట్లలో సిటీ బస్సులు యథావిధిగా నడిచాయి. ప్రతిరోజూ తిరిగే 3500 బస్సులకు తోడు మరో 350 బస్సులు అదనంగా నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. మధ్యాహ్నం తరువాత అన్నిరకాల రవాణా వాహనాలు రోడ్లపై కనిపించాయి.