సామాజిక ‘భద్రత’ అంటూనే ప్రభుత్వం ‘బొటన వేలి పరీక్ష’ పెట్టి పండుటాకులను తీవ్ర హింసకు గురిచేస్తోంది. వయసు మీద పడి.. ఒంట్లో సత్తువ పోయి.. నెత్తురు సచ్చిన వృద్ధులకు స్మార్ట్ కార్డు విధానం అమలు చేయడం వల్ల నెలనెలా వచ్చే రూ. 200 పింఛన్ కూడా రాకుండా పోతోంది. మలిసంధ్య వేళలో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధులు ప్రభుత్వం పెట్టిన విషమ పరీక్షలో ఓడిపోయి పస్తులుంటున్నారు. పింఛన్ కోసం నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పింఛన్‌దారుల అవస్థలు వర్ణణాతీతం. పింఛన్‌రాక, ఆసరాలేక దయనీయంగా కాలం వెళ్లదీస్తు న్నారు. మొత్తం 57,328 మంది వృద్ధాప్య పింఛన్‌దారులున్నారు. వీరిలో వేలిముద్రలు సరిపోవడంలేదని 19 వేల మందికి ప్రభుత్వం పింఛన్ నిలిపివేసింది. ఏం జరిగిందో.. పింఛన్ ఎందుకు రావడం లేదో తెలియక వృద్ధులు స్థానిక మండల కార్యాలయాల చుట్టూ తిరిగి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపడిపోతున్నారు. దయగల వాళ్లు వారి పట్ల జాలిపడి దోసెడు నీళ్లు తాపి, చెట్టు నీడకు కూర్చోబెడితే వాళ్లు బతికినట్టు, లేకుంటే అక్కడే అనాథ శవాలుగా మారిపోతున్నారు. ఇలాంటి హృదయ విదారకరమైన సంఘటనలు జిల్లాలో ఎన్నో జరుగుతున్నాయి.
పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకంటూ స్మార్ట్‌కార్డు మిషన్ల వినియోగాన్ని అమల్లోకి తెచ్చారు. పింఛన్‌దార్ల బొటన వేలిముద్రలు సేకరించి నమోదు చేశారు. ప్రతి నెలా పింఛన్‌దారుల బొటన వేలిముద్రలను స్మార్ట్‌కార్డు తెర మీద తీసుకొని, పాతవాటితో సరిపోతేనే ఆ నెల పింఛన్ ఇస్తారు. ఇలా నమోదు చేసిన వేలిముద్రలు మూడు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతున్నాయి.
ఆ తరువాతి నెల నుంచే సమస్యలు మొదలవుతున్నాయి. వృద్ధుల్లో రక్తంలేక నరాల బలహీనత వస్తోంది. సత్తువ లేకపోవడం, వణుకుతూ బలహీనంగా వేలు అద్దుతుండటంతో స్మార్ట్ కార్డు మిషన్ వారి వేలి ముద్రలను గుర్తించలేకపోతోంది. దీంతో వేలి ముద్రలు సరిపోవడం లేదంటూ అధికారులు ఏకంగా పింఛన్లను నిలిపివేస్తున్నారు. తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో దాదాపు 19 వేల మంది వృద్ధుల పింఛన్లు నిలిపివేసినట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి.
భిక్షాటన చేస్తున్న పెంటమ్మ
వెల్దుర్తి మండలం కుకునూర్‌కు చెందిన పెంటమ్మకు 68 ఏళ్లు. గ్రామంలో ఉన్న గుడిసె శిథిలావస్థలో ఉన్నందున పక్కన ఉన్న ఓ ముస్లింల ఇంట్లో తలదాచుకుంటోంది. కొడుకు, కోడలు ఎనిమిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం వలస పోగా ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. వేలిముద్రలు సరిపోవటం లేదని ఆమెకు పింఛన్ నిలిపివేశారు. పూట గడిచే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ఆమె భిక్షాటనతో బతుకీడుస్తోంది. వెల్దుర్తిలో నిర్వహించే ప్రజావాణిలో అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటున్నా ఉపయోగం లేదు. పింఛన్ రాకపోవడంతో గ్రామంలో ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరుగుతూ పిడికెడు మెతుకులు అడుక్కుని తింటోంది.
- పెంటమ్మ, కుకునూర్
సాంకేతిక, మానవీయ
కారణాలుంటాయి
జననం నుంచి మరణం వరకు వేలిముద్రల్లో ఎలాంటి మార్పులుండవు. స్మార్ట్ కార్డు మిషన్ వృద్ధుల వేలిముద్రలను అన్ని వేళల్లో ఒకే తీరుగా అంగీకరించకపోవడానికి సాంకేతిక పరమైన, మానవీయ కారణాలుంటాయి. మిషన్ మీద వేలిముద్రలు నమోదు చేసే సమయంలో నిపుణులు జాగ్రత్తగా ఉండి సేకరించాలి. వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దీ నరాల బలహీనత ఏర్పడి చేతులు వణుకుతాయి. దీంతో వేలుముద్రలు సరిగా పడకపోవడం వల్ల మిషన్ వాటిని గుర్తించకపోవచ్చు.
- రాజేందర్‌రెడ్డి,
వేలిముద్రల నిపుణుడు, ఫోరెన్సిక్ సీఐ
ఏలు అద్దితే పేరు రావట్లేదటా..
నెలనెలా ఇన్నూర్ల(రూ. 200) పింఛన్ వచ్చేది. ఇప్పుడు పింఛన్ రాక ఐదు నెలల పొద్దు అవుతుంది. ఏందో మిషన్ మీద ఏలు అద్దితే పేరు వస్తలేదని సారోళ్లు పైసలు ఇస్తలేరు. పేరు కూడా తప్పుగా ఉందంట్రుండ్రు. నడవటానికి చేతగానీ ముసల్దాన్ని..రోగమొస్తే ఆస్పత్రికి పోదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. పూట గడవటం కష్టంగా మారింది.. తూప్రాన్ మండలం, కిష్టాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల పోచమ్మఅంటూ కంటతడి పెట్టుకుంది.
బంధువుల వేలిముద్రలను
ఎన్‌రోల్ చేసేందుకు అనుమతి కోరాం
వృద్ధాప్య ఫింఛన్లలో కొందరు పింఛన్‌దారుల వేలిముద్రలు సరిపోకపోవడంతో సమస్య తలెత్తిన మాట నిజమే.. గతంలో నమోదు చేసిన నమూన వేలి ముద్రలతో ప్రస్తుత వేలిముద్రలను స్మార్ట్ కార్డు యంత్రాలు పోల్చుకోలేకపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారుల వేలిముద్రలు చెరిగిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యుల్లో ఒకరి వేలిముద్రలను నమోదు చేసుకోవచ్చు. అయితే, ఫినో, మనిపాల్ ఏజెన్సీల ద్వారా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు ఈ సౌకర్యం లేదు. ఈ లబ్ధిదారులకు సైతం ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పెన్షన్ డిస్బర్స్‌మెంట్ అధికారిని నియమించి పంపిణీని పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
- పి.రాజేశ్వర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ
పండుటాకులకు పస్తులే
Published Tue, May 27 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement