
వెట్టి జీవితాలకు విముక్తి
జోగిపేట: పొట్టకూటి కోసం ఉన్న ఊరును, అయిన వారినీ వదిలి వచ్చిన వలస జీవులకు కాంట్రాక్టర్లు కష్టాల జీవితాన్ని కానుకగా ఇచ్చారు. అడిగినన్ని పైసలిస్తామంటూ ఆశ చూపి చివరకు తిండి గింజలు కూడా ఇవ్వకపోవడంతో ఆ వలస జీవులు కన్నీళ్లు తాగి కడుపునింపుకున్నారు. ఇలా పిల్లాపాపలతో నాలుగేళ్లుగా నరకం చూసిన 55 మంది కూలీలు, వారి పిల్లలకు ఎట్టకేలకు గురువారం విముక్తి లభించింది.
పది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన 22 కుటుంబాలు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతినగర్ స్థిరపడ్డాయి. స్థానికంగా దొరికే పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వలస జీవులు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రకే చెందిన చందు అనే లేబర్ కాంట్రాక్టర్ పని కల్పిస్తానంటూ ఈ వలస జీవులకు వల వేశాడు. అడినంత కూలీ చెల్లిస్తానంటూ నమ్మబలికి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున అడ్వాన్స్ ఇచ్చాడు. కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకుని రోడ్లు వేసేందుకు ఉపయోగించే కంకరను కొట్టే పనిలో పెట్టాడు. అప్పటి నుంచి వీరికి డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేశాడు.
ఎవరైనా వెళ్లిపోతామంటే తనకు బాకీగా ఉన్న రూ.20 లక్షలు చెల్లించి వెళ్లిపోండంటూ భయపెట్టాడు. తాము ఎప్పుడు డబ్బు తీసుకున్నామంటూ కూలీలు ప్రశ్నించగా వారితో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు తీసి చూపించాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కూలీలంతా అతను ఇచ్చింది తీసుకుని పనులు చేసేవారు. ఒక్కోసారి కనీసం తిండిగింజలకు కూడా డబ్బులివ్వకపోవడంతో చిన్నారులను పోషించుకునేందుకు స్థానికంగా దొరికే వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం వెళ్లదీసేవారు.
ఏడాదికాలంగా నయాపైసా లేదు
ఏడాదిక్రితం నిజామాబాద్‌కు చెందిన రవీందర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ తాడ్మన్నూర్-కొడెకల్ రోడ్డు పనులు దక్కించుకున్నాడు. ఈ రోడ్డు పనులు చేయించేందుకు లేబర్ కాంట్రాక్టర్ చందును సంప్రదించగా, అతను మహారాష్ట్రకు చెందిన 22 కుటుంబాలను మెదక్ జిల్లా నాదులాపూర్‌కు తరలించాడు. వీరు ఉండేందుకు గాను గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అడవిలాంటి ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక గుడిసెలు వేయించాడు. దీంతో వలస జీవులంతా ఇక్కడే ఉంటూ రోడ్డుపనులు చేస్తున్నారు.
అయితే లేబర్ కాంట్రాక్టర్ చందు కనీస కూలి కూడా ఇవ్వకపోవడంతో వలస కూలీల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం తినేందుకు కూడా డబ్బులేక పస్తులున్నారు. ఈ క్రమంలోనే నాగోరావ్ అనే కూలీ ధైర్యంగా తన పెద్దనాన్న హన్మంతు సాయంతో న్యాయవాది సైదారావ్ ద్వారా కార్మిక శాఖను ఆశ్రయించాడు. జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు వివరించారు. దీంతో గురువారం అధికారులు నాదులాపూర్‌కు వెళ్లి కాంట్రాక్టర్ వద్దనున్న 55 మంది కూలీలు, వారి పిల్లలకు విముక్తి కలిగించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు తరలించారు.
కూలీల బాధలు విని చలించిన హోం మంత్రి
కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం మధ్యాహ్నం హుటాహుటిన అందోల్ మండలం నాదులాపూర్ గ్రామ శివారులో కూలీలు నివాసముంటున్న ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ కూలీలందరితో మాట్లాడారు. వారి సమస్యలు విని మంత్రి నాయిని చలించిపోయారు. రాళ్లు కొట్టిన చిన్నారుల చేతులను చూసి ఇంత దుర్మార్గమా అంటూ ఆవేదన చెందారు. వెంటనే బాధితులకు తగిన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంగారెడ్డిలోనూ విలేకరులతో మాట్లాడిన హోంమంత్రి వలస కూలీల కోరిక మేరకు రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఒకవేళ వారు మహారాష్ట్రకు వెళ్లాలనుకుంటే తగిన సాయం చేస్తామన్నారు.
వెళ్లిపోతానంటే చంపేస్తానన్నాడు
మాతో ఖాళీ బాండ్‌పేపర్లపై సంతకాలు తీసుకున్న చందు.. కూలి గిట్టడం లేదు వెళ్లిపోతామంటే చంపేస్తానని బెదిరించాడు. ఎదురుతిరిగి ప్రశ్నించినందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్కేడ్ ప్రాంతంలో ఓ సబ్‌కాంట్రాక్టర్ ఇంట్లో నాలుగు రోజులు బంధించాడు. కిడ్నీలు తీసేస్తా..నువ్వు పారిపోతే మహారాష్ట్రలోని మీ బంధువులను చంపేస్తానని బెదిరించాడు. అందువల్లే సచ్చినట్లు ఇక్కడే పనిచేస్తున్నా.
-నాగోరావ్, మహారాష్ట్రకు చెందిన కూలీ