‘ఉపాధి’..ఉఫ్..!
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీల పాలిట వరంగా మారింది. కరువు జిల్లాగా పేరొందిన పాలమూరులో ఆపన్నహస్తంగా ఉంది. నిత్యం పొట్ట చేతబట్టుకుని వలసలతో సతమతమయ్యే వారికి ఈ పథకం సాంత్వన చేకూర్చింది. అయితే.. ఇప్పటికే నిరాసక్తితో ఉన్న కేంద్రం త్వరలో ఈ పథకానికి మంగళం పాడే అవకాశం కనిపిస్తోంది. పటిష్ట భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ(ఐపీపీఈ) పేరుతో పథకాన్ని కేవలం పది మండలాలకే కుదించింది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇదే పద్ధతిని పూర్తిస్థాయిలో అమలు చేస్తే ఉపాధి ఊసేలేకుండా పోతుంది.
సాక్షి, మహబూబ్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో ఎంతోమంది పేదకూలీలకు ఆసరా ఇచ్చింది. ఈ పథకాన్ని ఆపివేస్తే వలసలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలో మొత్తం 8,79,534 కుటుంబాలు జాబ్‌కార్డులు పొందాయి. అయితే వీటిలో క్రియాశీలంగా మాత్రం 2,77,595 కుటుంబాలు మాత్రమే పనిచేస్తున్నాయి. సుమారు 4,80,420 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. వీరికి సరాసరిగా రూ.100.61 కూలీ అందుతుంది. అయితే ఇంత పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చుతున్న ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కేవలం కొన్ని మండలాలకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. పటిష్ట భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ (ఐపీపీఈ) కింద జిల్లాలో కేవలం పది మండలాలకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లాలో మొత్తం 64 మండలాలు ఉండగా, వాటిలో పదింటికి మాత్రమే చోటు దక్కింది. దీంతో మిగిలినచోట్ల అమలు ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఉపాధిహామీలో చోటుదక్కిన పది మండలాల్లో కూడా కొత్త మార్గదర్శకాలు వెలువడ్డాయి. గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా పనులు చేయడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టింది.
ఉద్యోగులపై వేటు
జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల జిల్లాలో వివిధస్థాయిలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కూలీలను, మేట్లను పర్యవే క్షించడం కోసం గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 800మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిని పర్యవేక్షించడం కోసం మండలస్థాయిలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు 271మంది ఉన్నారు. అలాగే అప్పిలేట్ ప్రోగ్రాం అధికారులు 53మంది, ఇంజనీరింగ్ కన్సల్‌టెంట్లు 39మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 136 మంది, ఏపీడీలు 12 మంది పనిచేస్తున్నారు. ఉపాధిహామీని కేంద్రం కుదిస్తే వీరి భవిష్యత్ గందరగోళంలో పడనుంది. ఇదిలా ఉండగా, ఉపాధిహామీ పథకం పట్ల కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. పథకం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా ప్రజాధనం దుర్వినియోగమవుతుందని అభిప్రాయపడుతుంది.
అంతేకాదు ఈ పథకం వల్ల పెద్దఎత్తున అవినీతి కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని, శాశ్వతంగా ఎలాంటి పనులూ జరగడం లేదని భావిస్తోంది. అలాగే ఈ పథకం కారణంగా వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని కేంద్రం అంచనాకొచ్చింది. అందులో భాగంగా దీన్ని కుదించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోంది. ఫలితంగా జిల్లాలో ఐపీపీఈ కింద కేవలం పది మండలాలకు కుదించారు.