సర్వే ఫలితాలతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్
సర్వే ఫలితాలతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్
Published Mon, Oct 24 2016 6:45 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, హైదరాబాద్ : సర్వే ఫలితాల్లో టీఆర్‌ఎస్ పాలనకు వస్తున్న ప్రజాధరణను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్ రెండున్నరేళ్ల పాలనకు 72 శాతానికిపైగా ప్రజల మద్దతు రావడం చూసి సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి నేత షబ్బీర్ అలీ ఏం చేయాలో పాలుపోలేని పక్షంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరుపారేసుకుంటున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో లక్షా 50వేల మందిని అరెస్టు చేసి, జైళ్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజలకు సౌకర్యార్థంగా ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాన్ని నిర్మిద్దామంటే ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సచివాలయంలో కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సచివాలయంలో, కనీసం పార్కింగ్ సౌకర్యం లేదని, అందులో కొన్ని భవనాలు నిజాం కాలంలో కట్టినవి కాగా, మరికొన్ని 50 నుంచి 60 ఏళ్ల కిందట నిర్మించినవని పేర్కొన్నారు. ఒక ఆఫీసు సెక్రటేరియట్‌లో, మరొకటి ఎర్రగడ్డలో, ఇంకొకటి మలక్‌పేటలో ఉంటే ప్రజలకు ఇబ్బంది కాదా.. అని ప్రశ్నించారు.
జేఏసీ చైర్మన్ కోదండరాం విపక్షాలా ఎజెండా మోస్తున్నారని, తెలంగాణ ప్రజల్లో తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు వద్దనే రీతిలో వ్యవహరిస్తున్న కోదండరాం రైతు దీక్ష ఎలా చేస్తారని కర్నె ప్రశ్నించారు. రైతులకు మేలు చేసే ప్రాజెక్టులను ఒక పక్క వ్యతిరేకిస్తూ మరో పక్క దీక్ష చేయడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా అని నిలదీశారు. సమయం కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం మీద గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కోదండరాం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అభినందించలేక పోతున్నారని విమర్శించారు.
Advertisement
Advertisement