చోరీకి పాల్పడుతుండగా ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు.
♦ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
♦ మృతుడు రంగారెడ్డి జిల్లావాసి
కొత్తూరు: చోరీకి పాల్పడుతుండగా ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దెయ్యాలగూడకు చెందిన తాళ్లపల్లి మల్లయ్య(48) శనివారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మొదళ్లగూడకు వచ్చాడు. ఆరుబయట నిద్రిస్తున్న దార మల్లమ్మ మెడలో నుంచి రెండు గ్రాముల బంగారు పుస్తె చోరీచేశాడు.
అక్కడినుంచి ఈదులపల్లికి చేరుకుని కిష్టమ్మ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆమె మేల్కొని కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు వెంబడించి పట్టుకుని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లయ్య భార్య మణెమ్మ ఇక్కడికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీశైలం కేసు దర్యాప్తు జరుపుతున్నారు.