ఇంటి గుట్టు గూగుల్!
⇔ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం బహిర్గతం
⇔ వివిధ పథకాల దరఖాస్తుదారుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో..
⇔ పేరు, చిరునామాతోపాటు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల సమాచారమూ ఓపెన్!
⇔ భద్రంగా ఉంచాల్సిన వివరాలన్నీ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం
⇔ ఓ కేంద్ర ప్రభుత్వ శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల నిర్లక్ష్యం
⇔ లక్షలాది మంది వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం
⇔ ‘ది వైర్’ ఆంగ్ల వెబ్‌సైట్ పరిశీలనలో వెల్లడి
మీరు ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకున్నారా..? ఏదైనా ప్రభుత్వ శాఖ నుంచి లబ్ధిదారుగా ఉన్నారా..? అయితే మీ పేరు, ఊరు, పుట్టిన తేదీ సహా వ్యక్తిగత అంశాలెన్నో బహిర్గతం అయిపోతున్నాయి. పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి భద్రంగా ఉండాల్సిన రహస్య సమాచారమూ ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చేస్తోంది. ఆన్‌లైన్‌లో కేవలం మీ పేరిటో, ఫోన్ నంబర్‌తోనో సెర్చ్ చేస్తే చాలు.. మిగతా వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖలు, విభాగాల నిర్లక్ష్య ధోరణే దీనికి కారణం. ది వైర్ అనే ఓ ఆంగ్ల వెబ్‌సైట్ పరిశీలనలో ఈ విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. – తెలంగాణ డెస్క్
మన పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటివన్నీ మన వ్యక్తిగతం. ఇవి ఎవరికీ తెలియడం మనకు పెద్దగా ఇష్టం ఉండదు, తెలిస్తే మోసాలకు, దుర్వినియోగానికి ఆస్కారం ఎక్కువ. కానీ ఏదో పథకం కోసమో.. మరేదో పనికోసమో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఇచ్చిన లక్షలాది మంది వివరాలు చాలా సులువుగా బహిర్గతం అవుతున్నాయి. కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖ నుంచి, పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతున్నట్లు తేలింది. అందులోనూ వివిధ సంక్షేమ శాఖల పరిధిలో పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు, లబ్ధి పొందిన వారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కూడా ఆయా శాఖల వెబ్‌సైట్లలో ఓపెన్‌గా దర్శన మిస్తున్నాయి.
అందులో పేర్లు, చిరునామాల వంటి వాటితోపాటు వారి కులం, మతం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్యాంకు ఖాతాల వివరాలూ ఉండడం గమనార్హం. భద్రంగా, రహస్యంగా ఉంచాల్సిన ఈ వివరాలన్నింటినీ ఆయా శాఖలు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైళ్లలో నమోదు చేసి, వెబ్‌సైట్లలో పెడుతున్నాయి. ఎవరైనా ఆయా వెబ్‌సైట్లు ఓపెన్ చేసిగానీ, ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిగానీ ఈ వివరాలు మొత్తం పొందగలిగేలా ఉండడం ఆందోళనకరంగా మారింది.
ఓ ట్వీటర్ పోస్టుతో నేపథ్యంలో పరిశీలన
ఎస్‌టీ–హిల్ (@St_Hill) అనే ఓ ట్వీటర్ యూజర్ పోస్ట్ చేసిన ఆర్టికల్‌తో ఈ అంశంపై దృష్టి పడింది. ప్రభుత్వ శాఖలు, విభాగాలు ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో, వ్యక్తిగత సమాచారం చోరీ అయితే ఉండే ప్రమాదాలేమిటనే దానిపై ఆ ఆర్టికల్‌లో వివరించారు. దీంతో ‘ది వైర్’దీనిపై పరిశీలన చేపట్టింది.
సంక్షేమ శాఖలు, విభాగాల నుంచి..
– ఒక ప్రతిష్టాత్మక పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వ్యక్తిగత వివరాలను ఓ కేంద్ర మంత్రిత్వ శాఖ బహిర్గతం చేసినట్లు తేలింది. అందులో పేరు, చిరునామాతోపాటు కుటుంబ వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలూ ఉన్నాయి.
– ఒక రాష్ట్ర ప్రభుత్వ శాఖ కూడా ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బాలల సంక్షేమం కోసం కేంద్రం నిర్వహిస్తున్న పథకాన్ని అమలు చేసే ఆ శాఖ.. వేలాది మంది బాలల పేర్లు, వారి చిరునామాలు, కులం, మతం, బ్యాంకు ఖాతాల వివరాలను ఇంటర్నెట్‌లో పెట్టేసింది.
– మరో రాష్ట్ర ప్రభుత్వ శాఖ.. ఓ పథకం కింద శిక్షణ పొందిన వారి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టింది.
– ఇక ఇంకో రాష్ట్ర ప్రభుత్వమైతే ఏకంగా లక్ష మంది ప్రజలకు సంబంధించిన వివరాలను నమోదు చేసిన ఎక్సెల్ ఫైల్‌ను వెబ్‌సైట్లో పెట్టడం గమనార్హం. ఓ సామాజికాభివృద్ధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న/లబ్ధిపొందిన వారికి సంబంధించి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందులో ఉన్నాయి.
– అయితే ఇలా బహిర్గతమైన సమాచారం ఎంతవరకు వాస్తవమనేదానిపై అధికారికంగా నిర్ధారణ కాలేదని, అందుకోసం ప్రయత్నిస్తున్నామని ‘ది వైర్’వెబ్‌సైట్ పేర్కొంది.
సరైన రక్షణ కల్పించకపోవడంతోనే..
మరో ఘటనలో ప్రభుత్వ సేవలను నిర్వహించే ఓ థర్డ్ పార్టీ వెబ్‌సైట్ పొరపాటున దాదాపు 5 లక్షల మంది బాలల పేర్లు, వారి ఫొటోలతోపాటు కులం, మతం, ఆధార్ వివరాలను బహిర్గతం చేసింది. ఆ వెబ్‌సైట్‌ను కొద్ది రోజుల తర్వాత మూసేశారని... కానీ వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఇది ఎత్తి చూపుతోందని స్పష్టం చేసింది. ఇక ఇటీవలే మెక్‌డొనాల్‌డ్డ్స ఇండియా స్మార్ట్‌ఫోన్ యాప్ వినియోగదారులకు సంబంధించి.. 22 లక్షల మంది వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయని గుర్తుచేసింది.
ఇది చట్ట విరుద్ధమే!
ఎవరికైనా సంబంధించిన వ్యక్తిగత అంశాలను బహిర్గతం చేయడం చట్ట ప్రకారం నేరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ చట్టం–2016 ప్రకారం ఆధార్ వివరాలను బయటపెట్టడం నేరం. ఆ చట్టంలోని సెక్షన్ 29 లో.. ‘‘ఆధార్ నంబర్‌ను గానీ, బయోమెట్రిక్ సమాచారాన్ని గానీ బహిరంగంగా ప్రదర్శించడం, ప్రచురించడం చేయకూడదు. చట్టంలో పేర్కొన్న కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది..’’అని స్పష్టం చేశారు కూడా.