ఈ మిర్చిని అమ్మేదెలా..? | There Is No Market-Yard For Sale Of Mirchi Crop In Karimnagar | Sakshi
Sakshi News home page

ఈ మిర్చిని అమ్మేదెలా..?

Published Fri, Jul 26 2019 10:26 AM | Last Updated on Fri, Jul 26 2019 10:27 AM

There Is No Market-Yard For Sale Of Mirchi Crop In Karimnagar - Sakshi

సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్‌) : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మిర్చి పంట విక్రయానికి మార్కెట్‌ సౌకర్యం కరువైంది. ఫలితంగా దళారులకు విక్రయించి రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు ఐదు వేల హెక్టార్ల(12,500 ఎకరాలు)లో రైతులు మిర్చి పంట సాగు చేస్తున్నారు. హెక్టారుకు రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి అవుతుండగా.. 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఈ లెక్కన ఏటా లక్ష క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుండగా.. విక్రయించడానికి జిల్లాలో ఎక్కడా మార్కెట్‌ సదుపాయం లేదు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.15 వేల వరకు పలికే మిర్చి పంటను దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో అక్రమంగా సేకరిస్తూ వరంగల్, గుంటూరు, నాగపూర్‌ మార్కెట్లకు తరలించడం పరిపాటిగా మారింది. కళ్లెదుటే రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగుతున్నా.. రెక్కల కష్టాన్ని రైతులు తెగనమ్ముకుంటున్నా పట్టించుకునే దిక్కేలేకుండా పోయింది.

సర్కారు సంకల్పిస్తే సాధ్యమే..
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో జిల్లాలోనే అగ్రగామిగా ఉన్న జమ్మికుంట యార్డులో మిర్చి మార్కెట్‌ నెలకొల్పాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. స్థానికంగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రెండు విశాలమైన యార్డులు, సరిపడా గోదాములు, రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండడంతో వ్యాపారులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.

కానీ.. సరుకుల నిల్వకు కోల్డ్‌ స్టోరేజీలు అనివార్యం. సర్కారు సంకల్పిస్తే వాటి నిర్మాణం పెద్ద కష్టమేం కాదు. రూ.10 కోట్ల లోపే నిధులు సరిపోతాయని అంచనా. ఇది సాకారమైతే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్, భూపాలపల్లి జిల్లాలోని రైతులకూ ప్రయోజనం కలుగుతుంది. ఉపాధి లేక విలవిల్లాడుతున్న హమాలీలు, దడ్వాయిలు, కూలీలు, చాటవాలీలకు చేతినిండా పని దొరుకుతుంది. 

తీరిన పసుపు రైతుల కష్టాలు
పత్తి, ధాన్యం, మొక్కజొన్నల వ్యాపారానికి జమ్మికుంట మార్కెట్‌ పెట్టింది పేరు. సర్కారు తాజాగా ఇక్కడ పసుపు కొనుగోళ్లకు సైతం శ్రీకారం చుట్టింది. ఏళ్లతరబడిగా రైతులు ఎదుర్కొంటున్న విక్రయ కష్టాలకు తెరపడింది. సమీప జిల్లాల రైతులకూ మేలు చేకూరింది. మిర్చి రైతులకూ అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వం వసతులు సమకూరిస్తే స్థానికంగా మిర్చి వ్యాపారానికి మార్గం సుగమం కానుంది. ఫలితంగా మార్కెట్‌ దశ తిగరడంతోపాటు కర్షక, కార్మిక, వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలగనుంది.

విస్తరిస్తున్న పచ్చబంగారం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. గతంలో వీటి సాగుకే పరిమితమైన రైతులు కొన్నేళ్లుగా పసుపు సాగుకు మొగ్గుతున్నారు. ఏటా 17 వేల హెక్టార్ల(42 వేల ఎకరాలు)లో పండిస్తున్నారు. హెక్టారుకు 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా, ఏటా ఏడు లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు అమ్మకానికి సిద్ధంగా ఉంటోంది. కానీ మార్కెటింగ్‌ సదుపాయం సక్రమంగా లేక రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.

రంగంలోకి జమ్మికుంట మార్కెట్‌..
గతంలో పసుపు అమ్మాలంటే వరంగల్, ఆర్మూర్‌ మార్కె ట్లకు వెళ్లాల్సి వచ్చేది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగి త్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, గొల్లపల్లి యార్డుల్లో పసుపు కొనుగోళ్లు ఆరంభించడంతో కర్షకుల కష్టాలు దాదాపు తీరాయి. ప్రభుత్వం ఈ సీజన్‌ నుంచి జమ్మికుంట మార్కెట్లోనూ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో ఈ ప్రాంత రైతులతోపాటు సమీపంలోని వరంగల్‌ అర్బన్, భూపాలపల్లి, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది.

స్థానిక మార్కెట్‌ కమిటీ చొరవతో వరంగల్‌ వ్యాపారులు రంగంలోకి దిగడంతో పసుపు క్రయవిక్రయాల్లో ఇబ్బందులకు తావేలేకుండా పోయింది. వచ్చే సీజన్‌ నాటికి కొనుగోళ్లను విస్తృతం చేసేందుకు కమిటీ కసరత్తు సాగిస్తోంది. కాగా, పసుపు విషయంలో చూపిన చొరవను మంత్రి ఈటల రాజేందర్‌ మిర్చి కొనుగోళ్లపైనా చూపాలని, కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రైతులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement