క్యాంపులో ఉండం.. ఇంటికి వెళ్తాం!
యాచారం: వెళ్లాలనుకున్న పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తున్నారు. నచ్చిన భోజనం పెడుతున్నారు.. సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.. కానీ ఇంటికే వెళ్తామంటున్నారు యాచారం మండల ఎంపీటీసీ సభ్యులు. యాచారం మండలంలో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారడంతో స్థానిక టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీలను కలిపి క్యాంపునకు తరలించారు. యాచారం ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతినాయక్‌ను ఎంపీపీని చేయడమే వీరి లక్ష్యం. ఇరవై రోజుల క్రితం ఇంటి నుంచి బయల్దేరిన వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దేవాలయాలను, ముఖ్యమైన పట్టణాలను సందర్శించారు.
ఎంపీటీసీ జ్యోతినాయక్ మామ బుచ్చానాయక్ క్యాంపును నడిపిస్తున్నాడు. సభ్యులు ఏం అడిగితే అది సమకూరుస్తున్నారు. బుచ్చానాయక్ అవస్థలు చూస్తున్న ఎంపీటీసీలు మాత్రం.. ఎందుకు ఇంత ఖర్చు వెళ్లిపోదాం.. అంటున్నారట. ఎన్నిక రోజున తప్పకుండా జ్యోతినాయక్ మద్దతు తెలిపి ఎంపీపీ ఎన్నికకు సహకరిస్తామని భరోసా ఇస్తున్నారట.
కానీ క్యాంపును వెనకుండి నడిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌లు మాత్రం ఇంకో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనీ.. అప్పటిదాకా తిరిగి రావొద్దని చెబుతున్నారట. రెండు రోజులుగా వీరి క్యాంపు ఖమ్మం జిల్లా భద్రచలంలో కొనసాగుతోంది. భార్యాపిల్లలతో వెళ్లిన ఎంపీటీసీ సభ్యులు కొందరు.. స్కూళ్లు ప్రారంభమయ్యాయని, ఇంటికి వెళ్దామని తొందర పెడుతున్నట్టు సమాచారం. వర్షాలు కురిస్తే వ్యవసాయపనులు మొదలయ్యే అవకాశాలున్న కారణంగా వ్యవసాయం ఉన్న మరికొందరు.. వెంటనే ఇంటికెళ్దామని ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు.
యాచారం మండలంలో 14 మంది ఎంపీటీసీ సభ్యులకుగానూ యాచారంతోపాటు చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, మంతన్‌గౌరెల్లి, చౌదర్‌పల్లి, గునుగల్, కొత్తపల్లి, తాడిపర్తి, మాల్ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి నాయక్‌కు ఎంపీపీని చేయడానికి మద్దతుగా క్యాంపులో ఉన్నారు. ఎంపీపీ ఎన్నికలో జాప్యం జరుగుతుండడంతో వారంతా ఇంటికి చేరుకోవడానికి ఆరాట పడుతున్నారు. గత 20 రోజులుగా క్యాంపు నిర్వాహణ ఖర్చు రూ.లక్షలు దాటినందున ఎంపీపీ ఎన్నిక తేదీ ఎప్పుడొస్తుందోనని.. నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు.