బాగుంది 'వరుస'...వీరుడెవ్వరో
వారంతా చుట్టాలు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తలో దిక్కు నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీలు వేరయినా వారంతా చుట్టాలే. వివిధ పార్టీల నుంచి టికెట్లు చేజిక్కించుకుని అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎవరికి వారుగా జనంలోకి దూసుకు వెళుతున్నారు. మనవాళ్లలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారని..బంధువులంతా అంచనాలు వేసుకుంటున్నారు.
మాజీ హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ చేవెళ్ల లోక్సభ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. హైదరాబాద్ జిల్లా గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ పోరులో నిలిచారు. ఇరువురిది బావ, బావమరిది వరుస. తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసిన వీరేందర్కు, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్కు తాజా ఎన్నికలు ప్రతిష్టాత్మకమయ్యాయి.
అటు మామ-ఇటు అల్లుడు
ఇక తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో ఇరు పార్టీల నేతలు ఉత్సాహంగా ఎన్నికల్లోకి దిగారు. ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగంలోకి దిగగా... హైదరాబాద్ జిల్లాలో అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంటు నుంచి గంగాపురం కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరిదీ మామ అల్లుడు వరస. ఒకరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా...మరొకరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటం విశేషం.