దోపి'ఢీ' | thiefs hulchul in methukusema | Sakshi
Sakshi News home page

దోపి'ఢీ'

Published Fri, Dec 18 2015 1:46 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

దోపి'ఢీ' - Sakshi

దోపి'ఢీ'

-  పేట్రేగుతున్న దొంగలు వరుస దోపిడీలతో హడల్
 - యథేచ్ఛగా సొత్తు అపహరణ చోద్యం చూస్తున్న పోలీసులు
-  భయం నీడలో జనం

 
 మెతుకుసీమ నేరాలకు అడ్డాగా మారుతోంది. ఎక్కడెక్కడో హత్యలు చేసి శవాలను జిల్లా సరిహద్దుల్లో పారేసి వెళుతున్నారు. మరోవైపు దొంగలు తెగబడుతున్నారు.. ముత్తూట్ ఫైనాన్స్.. గ్రామీణ వికాస బ్యాంకు.. కెనరా బ్యాంకు.. ఏటీఎంలు  ఇలా ఒక్కొక్కటి టార్గెట్ చేసి లూటీ చేస్తున్నారు.. పోలీసులు మాత్రం చేతులు పెకైత్తి చోద్యం చూస్తున్నారు. దొంగలు, హంతకుల నేరాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు అసలు పని వదిలేసి వ్యక్తిగత ‘సేవ’లో మునిగి తేలుతుండటం గమనార్హం.
 
 సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో నేరాలకు అడ్డూఅదుపులేకుండాపోతోంది. నిత్యం దోపిడీలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అదుపు చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. సీసీఎస్ ఉనికే లేదు. స్పెషల్ బ్రాంచ్, ఐడీ పార్టీ, ఇంటెలిజెన్సీ బలగాలు విధులను మర్చిపోయి ప్రతిపక్ష నేతల దిన చర్య, ఇతరుల వ్యక్తిగత వివరాలు సేకరించే  పనులతోనే కాలం వెళ్లదీస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. బీరంగూడ ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్స్ ఫైనాన్స్‌లో జరిగిన లూటీ మరిచిపోక ముందే దొంగలు తెగబడి మూడు చోట్ల ఏటీఎంలను టార్గెట్ చేయడం పోలీసుల డొల్ల తనాన్ని తెలియజేస్తోంది. ఎస్పీ కార్యాలయం ఉన్న సంగారెడ్డిలోనే పక్కా స్కెచ్‌తో ఏటీఎం పగులగొట్టి  నగదు తస్కరించడం సామాన్య ప్రజలను కలవర పెడుతోంది.   
 
 దొంగలదే పై చేయి ...
 వెల్దుర్తి మండలం మాసాయిపేటలో ఉన్న కెనరా బ్యాంకు దోపిడీ జరిగి నాలుగు నెలలు గడస్తున్నా ఇప్పటికీ దొంగలు దొరకలేదు. అక్టోబర్ నెల 28న బ్యాంక్ దోపిడీ జరిగింది. దొంగలు స్ట్రాంగ్‌రూమ్ గోడకు కన్నం వేసి ప్రత్యేక లాకర్లను ధ్వంసం చేసి 5 కిలోల బంగారు ఆభరణాలు, 15లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ బ్యాంకును లూటీ చేసింది ఎవరనే విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. శివ్వంపేట మండలం గోమారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో  సంవత్సరం క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి  లాకర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి  విఫలయయ్యారు. ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేదు. తాజాగా కౌడిపల్లిలో దొంగలు ఏటీఎం పగుల గొట్టడానికి విఫలయత్నం చేశారు.
 
 జహీరాబాద్‌లో..
 జహీరాబాద్ పట్టణంతో పాటు, నియోజకవర్గం పరిధిలోని బ్యాంకులను, ఏటీఎంలు, ఫైనాన్స్‌లను దొంగలు లక్ష్యంగా చేసుకొని లూటీ చేస్తున్నారు. ఇక్కడ దొంగలు దోచుకోవడమేగాని  ఇప్పటి వరకు దొరికింది లేదు.  2014 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి జహీరాబాద్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగలు పడ్డారు.రూ.13.45లక్షల నగదు, 7.5 కిలోల బంగారు నగలు దోచుకుపోయారు. ఆరు నెలలు గడిచినా పోలీసులు వాళ్లను పట్టుకోలేకపోయారు. సంగారెడ్డి డీఎస్పీగా తిరుపతన్న వచ్చిన తరువాత  ముత్తూట్ ఫైనాన్స్‌పై  కొంత ప్రగతి సాధించారు. సెప్టెంబర్ 9న జహీరాబాద్ పట్టణంలోని రఫి జ్యూయలర్స్ దుకాణంలో దొంగలు చొరబడి అర కిలో బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు. ఈ దొంగలు ఇంకా దొరకలేదు.  2013 మార్చి 18న కొత్తూర్(బి) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరికి పాల్పడి రూ.3.75లక్షల నగదును దోచుకెళ్లారు.  మార్చి 28న కోహీర్ మండలం కవేలి గ్రామంలో గల సిండికేట్ బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు.
 
 ఒకే రోజు మూడు చోట్ల....
 బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దొంగల స్వైర విహారం చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్న సంగారెడ్డి పాత బస్టాండ్ ఆవరణలోని ఇండిక్యాష్ ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 3.24 లక్షలను అపహరించారు. అక్కడి నుంచి కౌడిపల్లి, మెదక్ పట్టణాల్లోని ఏటీఎంలను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. మెదక్‌లో పోలీసులు దొంగలను వెంబడించినప్పటికీ  వారిని పట్టుకోవడం సాధ్యం కాలేదు.  
 
 ఆరితేరిన వారి పనే..
 దొంగలు మొదటగా సీసీ కెమెరాల మీదనే దృష్టి పెడుతున్నారు. కెమెరాలకు హార్డ్ డిస్కును కనెక్ట్ చేసే వైర్లను ముందుగా కత్తిరించడమో...లేదంటే కెమెరా విజన్ గుర్తించి దాని  పైకి తిప్పడం చేస్తున్నారు. 2014 నవంబర్ 3న అల్లాదుర్గంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో దొంగలు చోరికి యత్నించారు. అప్పుడు జరిగిన దొంగతనానికి రామచంద్రాపురం మండలం బీరంగూడలో జరిగిన లూటీకి కొంత సారూప్యం ఉందని తేలింది.
 
  అనంతర కాలంలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ సిమీ ఉగ్రవాదుల పనే అని నల్లగొండ ఉగ్రవాదుల కాల్పుల సంఘటనలో బయటపడింది.  బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీలో మొత్తం ఐదుగురు యువకులు పాల్గొనగా.. వారిలో ఇద్దరు మాత్రమే నల్లగొండ జిల్లా ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మిగిలిన ముగ్గురు ఏమయ్యారో మన పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు  మిగిలిన బ్యాంకు దోపిడీకి పాల్పడిన దొంగల వివరాలు మన పోలీసుల వద్ద లేనే లేవు. వరుస దొంగతనాలు జరుగుతున్నా ఇప్పటి మన పోలీసులు ఒక్క దొంగను కూడా పట్టుకోలేక పోయారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement