మత్స్య సమాఖ్యకు రూ.వెయ్యి కోట్లు
అంగీకారం తెలిపిన ఎన్‌సీడీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్యకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) రూ.వెయ్యి కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేర కు రాష్ట్ర పశుసంవర్థక శాఖకు లేఖ రాసింది. దీంతో రుణం విడుదలకు అవసరమయ్యే గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో రూ.600 కోట్లు ఎన్‌సీడీసీ రుణం కాగా, రూ.200కోట్లు కేంద్ర సబ్సిడీ, రూ. 200 కోట్లు లబ్ధిదారుల వాటా.
అయితే సబ్సిడీ రూ.200 కోట్లు రాకుంటే దీనిని కూడా రుణ రూపంలోనే తీసుకోవాల ని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌సీడీసీ నుంచి మంజూరైన రుణం నుంచి చేపల విక్రయానికి సొసైటీ సభ్యత్వం కలిగిన మత్స్యకారులకు మోపెడ్‌లు, ఆటోట్రాలీలు, హైజెనిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను 75శాతం సబ్సిడీ పై ఇవ్వనున్నారు. ఇందుకు రూ.320 కోట్లు కేటాయించనున్నట్లు ఎన్‌సీడీసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఉంది.
అలాగే మత్స్య సంపద పెం చేందుకు నీటి వనరుల అభివృద్ధి, చేప విత్తన క్షేత్రాలు, చేపల ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్‌సీడీసీ రుణంలో కేటాయింపులు చేశా రు. ముఖ్యంగా మత్స్య సంఘాలకు రాష్ట్రవ్యాప్తంగా 250 రిటైల్ చేపల మార్కెట్ల నిర్మాణానికి రూ.25కోట్లు, 30 జిల్లాల్లో హోల్‌సేల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.60 కోట్లు ఇవ్వనున్నారు. 10 చేపవిత్తన క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు వెచ్చిస్తారు. వంద శాతం సబ్సిడీపై సొసైటీల ఆధ్వర్యంలో చేప విత్తనాలకు, రొయ్య పిల్లల పెంపకానికి రూ.98 కోట్లు, జిల్లా యూనియన్ల ద్వారా 30 రిజర్వాయర్ల సమగ్ర అభివృద్ధికి రూ. 60 కోట్లు ఇవ్వనున్నారు. చేపలు పట్టేందుకు అవసరమైన తెప్పలు, వలల కోసం రూ.82 కోట్లు, 50 ఐస్ ప్లాంట్లకు రూ.12.50 కోట్లు కేటాయిస్తారు.