ముగ్గురు రైతుల బలవన్మరణం | Three farmers suside | Sakshi
Sakshi News home page

ముగ్గురు రైతుల బలవన్మరణం

Published Mon, Sep 7 2015 12:38 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

ముగ్గురు రైతుల బలవన్మరణం - Sakshi

ముగ్గురు రైతుల బలవన్మరణం

సాక్షి నెట్‌వర్క్: రాష్ర్టంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన రైతు ఎడ్డెడి పోశెట్టి(55) తనకున్న ఎకరంతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొన్నాడు. అప్పు చేసి ట్రాక్టర్ కూడా కొన్నాడు. అయితే ఈసారి సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. దీంతో మార్కెట్ గోదాంలో వాచ్‌మన్‌గా  చేరాడు. కాగా, గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పోశెట్టి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం మృతదేహం కనిపించింది.

అప్పుల బాధతోనే పోశెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేటకు చెందిన రైతు రాసిక చినమల్లయ్య (55) తనకున్న ఐదున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాలు లేక పత్తి చేను వాడిపోయింది. దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెందిన కుర్వ బజారి గోపాల్(30)తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి, వేరుశనగ సాగు చేశాడు. వీటి కోసం రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చలేనేమోనని మనస్తాపానికి గురై ఆదివారం ఉరేసుకున్నాడు.

 పంట ఎండిందని గుండెపోటు
 మాచారెడ్డి: పంట ఎండిందనే బెంగతో ఆదివారం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం అంకాపూర్‌లో గుండెల్లి లింగయ్య(55) అనే రైతు గుండెనొప్పితో కుప్పకూలాడు.  వెంటనే అతడిని కుటుంబ సభ్యులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.  

 కెనాల్‌లోపడి రైతు మృతి
 ధర్మసాగర్: గెదే తోక పట్టుకొని కాలువ దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అందులో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా ఎలుకుర్తిలో ఆదివారం జరిగింది. గుండవరపు వెంకట్రావు(65) ఆదివారం వ్యవసాయ బావికి వెళ్తున్న క్రమంలో కాలువను దాటేందుకు గెదే తోకను పట్టుకున్నాడు. ఈ క్రమంలో నీటిప్రవాహధాటికి పట్టుతప్పడంతో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement